తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం పలుచోట్ల భూమి కంపించింది. ఏం జరుగుతుందో తెలియక ఆ సమయంలో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాసేపటికే తేరుకొని అది భూకంపం అని నిర్థారించుకున్నారు. ఉదయం సరిగ్గా 7.27 గంటలకు భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. దీంతో, జనం భయపడి ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు గుర్తించారు. పలు ప్రాంతాల్లో భూప్రకంపనల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.3గా నమోదయినట్లు హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్, ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి చుట్టుపక్కల 225 కిలోమీటర్ల పరిధిలో భూకంప ప్రభావం కనిపించిందని అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టయగూడెం, టి.నరసాపురం మండలం బొర్రాంపాలెం, జంగారెడ్డిగూడెం పట్టణంలోనూ, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, గంపలగూడెం, అనుముల్లంక, తిరువూరు, పెనుగంచిప్రోలు భూమి కంపించినట్లు గుర్తించారు. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో భూమి కంపించింది. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లి, కాటారం, నర్సంపేట, జనగామ, చెన్నారావుపేట మండల కేంద్రం తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.