తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు అరుదు. బయట ప్రపంచంలో, మనదేశంలోని ఇతర ప్రాంతాల్లో తరచూ భూకంపాలకు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉంటాం. కానీ, మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి భూకంపాల ప్రభావం చాలా తక్కువ. ఈ ప్రాంతంలో కడసారి 50 యేళ్ల క్రితం భూమి కంపించింది. 1969లో భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రత నమోదయ్యింది. భూకంప కేంద్రాన్ని అప్పుడు అధికారులు భద్రాచలం పరిసరాల్లో గుర్తించారు. ఆ తర్వాత ఈ స్థాయిలో మళ్లీ ఇప్పుడు భూమి కంపించిందని శాస్త్రవేత్లలు చెబుతున్నారు. భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థాన చలనం జరిగి ఈ ప్రకంపనలు వస్తుంటాయన్నారు. హైదరాబాద్, ఏటూరు నాగారం, ములుగు తదితర ప్రాంతాలు జోన్-3లో ఉన్నాయని, అదే ఉత్తర భారత దేశం జోన్ -5లో ఉందని, ఉత్తరాదిలో భూకంపాలు తరచూ వస్తాయని, అక్కడ తీవ్రత కూడా ఎక్కువ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు.