– కాంగ్రెస్ యేడాది పాలనపై విపక్షాల విమర్శలు
– 6అబద్ధాలు, 66 మోసాలన్న బీజేపీ
– రేవంత్ మాటల మాంత్రికుడన్న బీఆర్‌ఎస్
కాంగ్రెస్‌పార్టీ తెలంగాణలో యేడాది సంబరాలు జరుపుకుంటోంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తాము ఈ యేడాదిలో చేసిన ప్రగతికి ప్రచార హంగులు అద్దుకుంటున్నారు. ఒక్కరోజు మాత్రమే కాకుండా.. ఏకంగా వారోత్సవాలే నిర్వహిస్తోంది కాంగ్రెస్ సర్కారు. అయితే, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు మాత్రం కాంగ్రెస్ పాలనపై పెదవి విరుస్తున్నాయి. బీజేపీ అయితే ఏకంగా 6 అబద్ధాలు.. 66 మోసాలు పేరుతో ఏకంగా చార్జిషీట్‌నే విడుదల చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దొందూ దొందే అని పెదవి విరిచింది. ఇక, ఇటు బీఆర్‌ఎస్ కూడా తన సహజ ధోరణిలో రేవంత్ సర్కారు వైఫల్యాలపై విరుచుకుపడుతోంది.
బీజేపీ చార్జిషీట్ :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై రాష్ట్ర బీజేపీ చార్జిషీట్ విడుదల చేసింది. ‘కాంగ్రెస్ గ్యారంటీల గారడీ 6 అబద్ధాలు.. 66 మోసాలు’ కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ చార్జిషీట్ విడుదల చేశారు. దోపిడీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందేనని బీజేపీ విమర్శించింది. మారింది పాలకులే కానీ పాలన, ప్రజల బతుకులు మారలేదని చార్జిషీట్ లో దుయ్యబట్టింది. అప్పుడు కాళేశ్వరంతో లక్ష కోట్ల దోపిడీ, ఇప్పుడు మూసీతో లక్షన్నర కోట్లకు ఎసరు పెట్టారని ఆరోపించింది. గత పదేళ్లలో కే-ట్యాక్స్ ఉంటే ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించింది. ప్రజాస్వామాన్యానికి పాతరేస్తూ బీఆర్ఎస్ 12 మంది ఎమ్మెల్యేలను గతంలో గుంజుకుంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కొనుగోలు చేసిందని విమర్శించింది. ధరణితో 10 లక్షల రైతుల భూములను బీఆర్ఎస్ మాయం చేస్తే, ఇప్పుడు హైడ్రా, ఫోర్త్ సిటీతో కాంగ్రెస్ లక్షల ఇళ్ల కూల్చివేతలకు సిద్ధమైందని ఆరోపించింది. ఇక ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల్లో ముంచితే ఇప్పుడు ఏడాదిలోనే రూ.80 వేల కోట్ల అప్పులను కాంగ్రెస్ చేసిందన్నారు. ఆడబిల్లలకు జీరో వడ్డికే రుణాలు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే, స్కూటీ, తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని పేర్కొన్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ పాలనలో మహాలక్ష్మి పేరుతో మోసం, చీకట్లు నింపిన గృహజ్యోతి, అందని చేయూత, రైతుకు రాని భరోసా, కలగానే సొంతిండ్లు, కానరాని యువ వికాసం నిలిచిపోయిందని విమర్శించింది.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలు అప్పుడే ఆలోచనలో పడ్డారన్నారు. కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పదేళ్ల పాటు బీఆర్‌ఎస్.. నియంతృత్వపాలన, కుటుంబపాలన, అవినీతి పాలన సాగిస్తే… అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు.
ఈ ఏడాది కాలంలో హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ విజయోత్సవాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని, విజయోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వాటిని ప్రజల ముందు పెడుతున్నామన్నారు. గ్యారెంటీలు, డిక్లరేషన్ పేరుతో ఆయావర్గాలను ఎలా నమ్మించిందో ఆ ఆంశాలపై తెలంగాణ ప్రజల పక్షాన చార్జిషీట్ రూపంలో విడుదల చేశామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడాలేదన్నారు. రుణమాఫీ అసంపూర్ణంగా అమలైందన్నారు. రైతుభోరోసా పేరుతో తెలంగాణ రైతులకు వెన్నుపోటు పొడిచిందన్నారు. పండించిన పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం వరికి మాత్రమే ఇవ్వడం ఏంటని నిలదీశారు.
బీఆర్‌ఎస్ స్క్రీన్ ప్రెజెంటేషన్ :
మరోవైపు.. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ‘నాడు నేడు’ పేరుతో.. ఎన్నికల ప్రచారంలో సీఎం ఇచ్చిన హామీలను స్క్రీన్‌లో ప్రదర్శించారు. ముఖ్యమంత్రికి సిగ్గు ఎగ్గు లేదంటూ ఫైర్ అయ్యారు. మాటలు మార్చటంలో రేవంత్ రెడ్డి పీహెచ్‌డీ చేశారని.. రెండు కాదు.. మూడో మాట కూడా మార్చగల నేర్పరి అని, పూటకో పార్టీ మార్చటం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, రాక్షసులు అన్న నోటితోనే.. దేవత అని పొగడగల సామర్థ్యం రేవంత్ రెడ్డి సొంతమని విమర్శించారు. ఏడాది పాలనలో కూల్చివేతలు తప్ప.. రేవంత్ నిర్మించినవి లేవని, తనది కూడా పోలీస్ కుటంబం అన్న సీఎం.. పోలీస్ కుటుంబాలను రాచిరంపాన పెడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఏడాది పాలనలో రైతుబంధు, బతుకమ్మ చీరలు, ఎల్ఆర్ఎస్, కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా.. ప్రతి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని, ఆడపిల్లను మోసం చేయటమంటే పాపం చేసినట్లు తెలంగాణ సమాజం భావిస్తుందని హరీష్ రావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ కట్టొద్దని ప్రజలను కోరుతున్నామని, పోటీ పరీక్షల విషయంలో ముఖ్యమంత్రిది.. డబుల్ కాదు.. ట్రిపుల్ స్టాండర్డ్ అని, పార్టీ ఫిరాయింపుల విషయంలో సైతం రేవంత్ రెడ్డి మాట మార్చారని విమర్శించారు. సీఎం ప్రారంభించబోయే.. కోకాకోలా కంపెనీకి సరఫరా అయ్యే నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళేనని అన్నారు. పోటీ పరీక్షల వాయిదా విషయంలో ఎవరు తలకుమాసినోడో రేవంత్ రెడ్డికు తెలుసునని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్‌కు.. సోనియా గాంధీ కూడా బలయ్యారని, పచ్చ పార్టీలో ఉన్నప్పడు సోనియా బలిదేవత.. మూడు రంగుల జెండా పట్టగానే దేవత అయ్యారని, అవసరమైతే కాళ్ళు పట్టుకోవటం.. తర్వాత కాళ్ళు గుంజటం ముఖ్యమంత్రి నైజమని హరీష్ రావు విమర్శించారు. రాళ్ళు వేయటం… పువ్వులు వేయటంలో కూడా సిఎం దిట్టని.. సమగ్ర సర్వేపై అప్పట్లో విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు వేయటం లేదా అని ప్రశ్నించారు. కూల్చివేతల విషయంలో ఆనాడు ఏం మాట్లాడారు. ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు.
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. మోసం దగా.. వంచనకు నిలువెత్తు నిదర్శనమని.. సీఎం భాషతో పిల్లలు చెడిపోతారని తల్లిదండ్రులు భావిస్తున్నారని హరీష్ రావు అన్నారు. నక్సలైట్లు ఉండాలని గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు వద్దు అంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. తెలంగాణలో మూడో ఫేక్ ఎన్‌కౌంటర్ జరిగిందని ఆరోపించారు. ఫార్మాసిటీ కాదని లెఫ్ట్ పార్టీల నేతలకు చెప్పి.. ఇప్పుడు మాట మార్చారన్నారు.