- బుధ, గురువారాలు ఇకపై కార్యకర్తల వారాలు
- వారానిక రెండు రోజులు జగన్ క్షేత్ర స్ధాయి పర్యటనలు
- సంక్రాతి తరువాత ’కార్యకర్తలతో జగన్‘ కార్యక్రమానికి శ్రీకారం
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. నూతన సంవత్సరంలో సరికొత్త ఎత్తుగడలను సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించడానికి దూరం అవుతున్న కార్యకర్తలను మళ్లీ దగ్గరకు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. నాయకులు కాదు జెండా మోసే కార్యకర్తలే పార్టీకి పునాదులు అన్న విషయాన్ని క్యాడర్ లో బలంగా నాటలని జగన్ నిశ్చయానికి వచ్చారు. అందుకే కార్యకర్తలతో జగన్ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సంసిద్దమవుతున్నారు. ఇప్పటి వరకు జనం కోసం పర్యటన చేసిన జగన్… మొదటి సారి ప్రత్యేకంగా కార్యకర్తల కోసమే ప్రయాణం కడుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. వారంలో రెండు రోజులు పూర్తిగా కార్యకర్తల కోసం కేటాయించాలని, దీని కోసం క్షేత్ర స్థాయిలో తిరగాలని జగన్ తీసుకున్న నిర్ణయం రానున్న రోజుల్లో కీలకంకానుంది.
గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత అప్పుడప్పుడు మినహా దాదాపుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితం అయ్యారు. ఇక్కడ కూడా నాయకులతో మాత్రమే సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఢక్కామోక్కీలు తిన్న కార్యకర్తలు, కూటమి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభిమానులను జగన్ కలుస్తున్న సందర్భాలు తక్కువే ఉంటున్నాయి. దీనితో పార్టీలోనే జగన్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. జగన్ చుట్టూ ఆ కొద్ది మంది నేతల కోటరీ మాత్రమే ఉండటంతో తమను పట్టించుకునే నాథుడు లేడు అన్న నిస్పృహ కార్యకర్తల్లో నెలకొంది. ఒకవైపు పలువురు నాయకులు పార్టీని వీడుతుండటంతో… కార్యకర్తలకు, తనకు గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వచ్చే సంక్రాంతి తర్వాత జిల్లాల బాట పట్టాలని జగన్మోహనరెడ్డి నిర్ణయించారు. వారంలో రెండు రోజుల పాటు జిల్లాల పర్యటన ఉంటుంది. ప్రతి వారం ఒక జిల్లా పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 33 జిల్లాలు అంటే సుమారుగా 8 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగే ఛాన్స్ ఉంది. వారంలో రెండు రోజులు బుధవారం, గురువారం జగన్ ఆయా జిల్లాల్లో ఉంటారు. అక్కడే బస చేస్తారు. ఈ రెండు రోజులు పూర్తిగా పార్టీ కార్యాకర్తలకే కేటాయించనున్నారు. నియోజకవర్గాల వారీగా కింది స్థాయి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. ప్రజా సమస్యలు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి పై కార్యకర్తల నుంచే డైరెక్ట్ గా ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ల పై కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ద్వారా జగన్ కార్యకర్తలకు భరోసా ఇవ్వనున్నారు. అయితే ఇక్కడ మరో కీలకమైన అంశం కూడా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల నుంచి ఏకంగా 11 స్థానాలకు పడిపోవటానికి గల కారణాల్లో ప్రజలకు వైసీపీ క్యాడర్ కు మధ్య దూరం పెరగటం కూడా ఒకటి.
2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించటానికి పార్టీ క్యాడర్ కాకుండా వాలంటీర్లు అనే న్యూట్రల్ సిస్టమ్ ను తీసుకుని వచ్చారు. సంక్షేమ పథకాల అందజేత విషయంలో రాజకీయ జోక్యం ఉంటే జన్మభూమి కమిటీల్లా లంచాలు, ఆధిపత్యం పెరిగిపోతాయని భావించి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలు లాభపడ్డారు కాని వైసీపీ రాజకీయంగా తీవ్రంగా నష్టపోయింది. పార్టీకి, ప్రజలకు మధ్య గ్యాప్ ఏర్పడింది. అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా ఇంటికే వచ్చి అందేవి. స్థానికంగా ఉండే వైసీపీ కార్యకర్తలు, నాయకుల అవసరం ప్రజలకు లేకుండా పోయింది. దీనితో పార్టీ క్యాడర్ లో నిస్సత్తువ ఆవహించింది. వారితో సంబంధం లేకుండానే ప్రజలకు అందాల్సినవి అందుతుంటే…లబ్దిదారులు మాత్రం వీళ్లను ఎందుకు ఖాతరు చేస్తారు. ఐదేళ్ల పాటు లక్షల కోట్ల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించినా…ఎన్నికల్లో ఓటమి తప్పలేదు.
దీనితో ముందుగా పర్యటనలు చేయాల్సింది జనం కోసం కాదు పార్టీని నమ్ముకుని జెండా మోస్తున్న కార్యకర్తల కోసం అని జగన్ గ్రహించినట్లు ఉన్నారు. పార్టీని గ్రామ, బూత్ స్థాయి లో బలోపేతం చేయకపోతే పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుందన్న విషయంలో రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. గత ఎన్నికల ఫలితాలు ఈ పాఠాన్నే వైసీపీకి నేర్పాయి. జగన్ పార్టీ అధినేతగా తమ కార్యకర్తలతో మమేకం కావాలని, వారిలో భరోసా, స్థైర్యం నింపాలని నిర్ణయం తీసుకోవటం రాజకీయంగా ఆహ్వానించదగిందే. కీలకమైన జిల్లాల పర్యటనల్లో పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తున్నది ఎవరు, నిర్లక్ష్యానికి గురయ్యాం అన్న ఫీలింగ్ తో పార్టీకి దూరమైన అభిమానులు ఎవరు, యాక్టివ్ గా ఉన్న వారెవరు అనేది గుర్తించగలిగితే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు