- డాలర్ కి ఎదురు చెబితే వంద శాతం టారిఫ్
- బ్రిక్స్ దేశాలను భయపెడుతున్న సుంకాల మోత..
- డాలర్ ప్రత్యామ్నాయ కరెన్సీ తేవాలని చూస్తే ఇక అంతే
ఇంకా శ్వేతసౌధంలోకి చేరకుండానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డాలర్ కరెన్సీకి ఎదురు లేకుండా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టకుండానే దూకుడుగా ప్రకటనలు ఇస్తున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలకు వార్నింగ్ ఇస్తున్నారు. డాలర్ కు పోటీని, ప్రత్యామ్నాయాన్ని తేవాలని ట్రై చేస్తే బ్రిక్స్ లో సభ్య దేశాలన్నింటికీ వందశాతం టారిఫ్ విధిస్తామని ప్రకటించారు.. టారిఫ్ అంటే ఇంపోర్టెడ్ వస్తువుల మీద పన్ను విధింపు. బ్రిక్స్ సభ్యదేశాలన్నీ డాలర్ కు పోటీ కరెన్సీని తేవాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోందని అదే జరిగితే టారిఫ్ తప్పదని హెచ్చరించారు.బ్రిక్స్ లో దేశాలన్నీ డాలర్ కి పోటీ కరెన్సీ తేవడంకానీ, మరే ఇతర కరెన్సీకి మద్దతు ప్రకటించినా ఊరుకోబోమని అన్నారు.యూ ఎస్ ఎకానమీలో వారికి చోటు ఉండదని, వారి ఉత్పత్తులు తమ దేశంలో అమ్ముకునే వీలుండదనీ తెగేసి చెప్పారు. బ్రిక్స్ దేశాల మధ్య కరెన్సీ మారకం డాలర్ రూపంలోనే ఉండబోతోందన్నారు. ట్రంప్ నిర్ణయం ప్రభావం బ్రిక్స్ దేశాలపై పడనుంది. భారత్ సహా బ్రెజిల్,చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇందులో చైనా,రష్యా సూపర్ పవర్ దేశాలు కావడంతో అమెరికా తన ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందో అని భయపడుతోంది. డాలర్ ను ఒక రాజకీయ ఆయుధంగా అమెరికా వాడుతుండటంతో ప్రత్యామ్నాయ కరెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అక్టోబర్ లో జరిగిన బ్రిక్స్ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు బ్రెజిల్, భారత్ వ్యతిరేకం. కారణం చైనా అనుకూలవిధానాలు కానీ, పాశ్చాత్య వ్యతిరేక విధానాలుకానీ ఆమోదించరాదన్నది భారత్ ఉద్దేశం. వచ్చే నెల 20న ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే చైనాని కట్టడి చేసే విధానాన్ని ట్రంప్ అనుసరించబోతున్నారు. అందుకే అధికారం ఇంకా చేపట్టకుండానే చైనా ఉత్పత్తులపై పదిశాతం టారిఫ్ మెక్సికో, కెనడాల పై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అక్రమ చొరబాట్లు, నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుపుతున్నాయన్న ఆరోపణలపై ఈ రెండు దేశాలపై ట్రంప్ ఈ ప్రకటన చేశారు.అయితే కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో అమెరికా వెళ్లి ట్రంప్ ను కలసి శాంత పరుచుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద మళ్లీ డాలర్ కు ఎదురే లేని వాతావరణం ట్రంప్ కల్పిస్తున్నారు.దీనిపై బ్రిక్స్ సభ్య దేశాలేమంటాయో ఇంకా తెలియ రాలేదు.