31.2 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

కశ్మీర్ పేరెత్తితే పాకిస్తాన్ కు చిక్కులు

జమ్ముకశ్మీర్‌ ఆంశంలో భారత్‌ను ఇరుకున పెట్టాలని దశాబ్దాలుగా పాకిస్తాన్‌ కుయుక్తులు పన్నుతోంది. తాజాగా పహల్గాం దాడి తదనంతర పరిణామాలు పాకిస్థాన్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి.

పాక్‌లోని తీవ్రవాద శిబిరాలపై భారత్‌ చేసిన దాడులు చావుదెబ్బ తీశాయి. అదే సమయంలో బలుచిస్తాన్‌, ఖైబర్‌ ఫక్తూంక్వా రాష్ట్రాల్లో వేర్పాటు వాదం తీవ్రం అవుతోంది. బలుచిస్తాన్‌ రాష్ట్రంలో ఇప్పటికే అందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. భారత్‌తో యుద్ధం తర్వాత ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రూపులు స్వాతంత్రం ప్రకటించుకున్నాయి. తాము పాకిస్తానీలం కాదని తమది స్వతంత్ర దేశం డెమొక్రాటిక్ రిపబ్లిక్ అఫ్ బెలుచిస్తాన్ అని చెప్పుకుంటున్నాయి.

పాకిస్తాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న మహరంగ్‌ బలూచ్‌ విమర్శలకు పదునుపెట్టారు. బలుచిస్తాన్‌ హక్కులు పరిరక్షించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బలూచ్‌ తిరుగుబాటుదారులు పాకిస్తాన్‌ సైన్యం, చైనా పౌరులు ఎక్కడ కనిపించినా బీకరమైన దాడులు చేస్తున్నారు.

బలూచ్‌ గ్రామీణ ప్రాంతాల్లో పాకిస్తాన్‌ చట్టాలను అమలు చేసే యంత్రాంగం కరువైంది. బలూచ్‌ తిరుగుబాటుదారులకు భయపడి గ్వదార్‌ ఓడరేవులో చైనా సొంతంగా రక్షణ ఏర్పాట్లు చేసుకుంది. చైనా ఉద్యోగులు ఉండే ప్రాంతాల్లో చైనా దళాలకే రక్షణ బాద్యత అప్పగించారు. భద్రత లేకుండా చైనీయులు బలుచిస్తాన్‌లో తిరిగే పరిస్థితి లేదు.

మరోవైపు ఖైబర్‌ ఫక్తూంక్వా రాష్ట్రంలో తేహ్రిక్‌ ఏ తాలిబాన్‌(టిటిపి) తిరుగుబాటుదారులు అవకాశం దొరికినప్పుడల్లా పాక్‌ సైన్యాన్ని టార్గెట్‌ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పాక్‌ సైన్యం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాజధాని పెషవార్‌ కూడా సురక్షితం కాదని సైన్యం భావిస్తోంది. ఫష్తూన్‌ తెగ ఈ రాష్ట్రంలో అధికంగా ఉంటుంది. అఫ్గన్‌ లో కూడా ఫష్తూన్‌ గిరిజనులదే ఆధిపత్యం. ఆఫ్ఘన్లతో వీరికి బంధుత్వాలు ఉన్నాయి.

ఆఫ్ఘన్‌తో వివాదం మొదలయ్యాక అనేక మంది శరణార్థులను పాక్‌ బలవంతంగా సరిహద్దులు దాటిస్తోంది. దీంతో ఫష్తూన్లలో అసంతృప్తి పెల్లుబికి టిటిపి బలపడే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు దేశభక్తికి మారుపేరుగా ఉన్న పష్తూన్లు తిరుగుబాటు చేయటతో వారిని అదుపు చేయటం పాక్‌ వల్ల కావడం లేదు.

దీనికి తోడు డ్యూరాండ్‌ రేఖను గుర్తించడం లేదని ఆఫ్ఘాన్‌ భూభాగాన్ని పాక్‌ అక్రమించిందని సరిహద్దుల్లో తాలిబాన్లు దాడులు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో అలజడులు పాక్‌ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

పాకిస్తాన్‌ ఆవిర్భావం నుంచి ప్రభుత్వంలో పంజాబీలదే ఆధిపత్యం. పేరుకు ఇస్లామాబాద్‌ రాజధాని అయినా లాహోర్‌ కేంద్రంగానే కొత్త చట్టాలకు రూపకల్పన జరుగుతుందని ఆ దేశంలో నానుడి ఉంది. తాజాగా సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్థాన్‌ వ్యవసాయ రంగం సంక్షోభం ఎదుర్కునే పరిస్థితి ఎదురవుతోంది.దేశంలో ఎవరెన్ని కష్టాలు అనుభవించినా పట్టించుకోని పాలకులకు సింధు జలాల ఒప్పందం రద్దుతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

పంజాబ్‌ రైతాంగం ఎదురుతిరిగితే ప్రభుత్వాలు కూలిపోయే బెడద ఉంది. దీంతో రాజకీయ సుస్థిరత కోసం భారత్‌తో చర్చలు ఆరంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కశ్మీర్‌ ఆంశం కోసం పట్టుదలకు వెళితే పాక్‌ ముక్కలు చెక్కలయ్యే ప్రమాదం పొంచి ఉంది.

కశ్మీర్ కోసం పట్టుపడితే గతంలో బంగ్లాదేశ్ వేరైంది. ఇప్పుడు ఓవైపు భారత్‌…మరోవైపు అఫ్గనిస్థాన్‌ సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తే బలుచిస్తాన్‌, ఖైబర్‌ ఫక్వూంక్వా రాష్ట్రాలు స్వతంత్రం ప్రకటించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com