- కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళా శక్తిని తక్కువగా అంచనా వేయవు
- ఇందిరమ్మ మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు
- వియ్ హబ్ విమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమంలో సీయం రేవంత్ రెడ్డి
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాదులో వియ్ హబ్ విమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీయం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయూతనిచ్చే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళా శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవని చెప్పారు.1971లో ఇండియా, పాకిస్తాన్ యుద్దం జరిగినప్పుడు ఇందిరమ్మ మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. ఆనాడు దేశాన్ని గెలిపించింది మహిళా శక్తే అని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి మహిళలకు సోనియమ్మ నజరానా అందించామని ఈ సందర్భంగా సీయం గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ఆడబిడ్డలకు అప్పగించామని, విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే పనిని కూడా మహిళా సంఘాలకు అప్పగించామని, వ్యాపార రంగంలో మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు సీయం పేర్కొన్నారు. పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునేలా, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలను చేసేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని మా ప్రభుత్వం నమ్ముతోందన్నారు. రేవంతన్నగా మీకు ప్రోత్సాహం అందిస్తా… స్వయం సహాయక బృందాలను కోటికి పెంచుకోవాలని మహిళలకు సీయం సూచించారు. దేశంలో పలు కార్పొరేట్ కంపెనీలకు బ్యాంకులు 16 లక్షల కోట్లు రుణాలు ఇస్తే ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయారని అదే మహిళలకు రుణాలు ఇస్తే వడ్డీతో సహా చెల్లిస్తున్నారని… ఆర్థిక క్రమశిక్షణ ఆడబిడ్డల సొంతం అని దీన్ని బట్టే అర్ధమవుతోందని సీయం అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలని ఈవేదిక మీదనుంచి సీయం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.