- ఈ నెల 28న నాలుగు రాష్ట్రాల సీయంలతో ప్రధాని వీడయో కాన్ఫరెన్స్
- పోలవరం విషయంలో ప్రధాని మోడీ తొలిసారి సమీక్ష
- పాల్గొననున్న ఏపీ, తెలంగాణ, ఒడిషా, చత్తీస్‌గడ్ సీయంలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి. రాష్ట్రం ఏవత్తూ కొన్ని దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారు. పోలవరం నిర్మాణ పనుల పురోగతిపై ప్రధాని నరేంద్రమోడీ మొదటి సారిగా సమీక్ష నిర్వహించనున్నారు. ఎలాగైనా ఈ తడవ పోలవరం పూర్తి చేసి ఆంధ్రుల చిరకాల కోరిక నేరవేర్చాలనే దృక్పథంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నాయన్నది ఈ చర్యతో అర్ధమవుతోంది. అనేక ఏళ్ళుగా పోలవరం నిర్మాణం అలా కొనసాగుతూనే ఉంది తప్పితే ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తవుతుందన్న నమ్మకం మాత్రం రాష్ట్ర ప్రజలకు కలగడం లేదు. ఈ దశలో స్వయంగా ప్రధాని మోడీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారాలపై దృష్టి సారించడంతో ఆంధ్రుల ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి. పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఒడిషా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో ప్రధానమంత్రి సమీక్ష చేయనున్నారు. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమీక్షా సమావేశానికి హాజరుకావాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులకు ఇప్పటికే సమాచారం వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంజీ, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిలతో పాటు ఆ నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు కూడా ప్రధానితో జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఈ నాలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ప్రధానమంత్రి కార్యాలయంల నుంచి సమాచారం అందింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభమైనప్పటికీ ఆయన మృతి తరువాత ప్రాజెక్టు పనుల్లో పురోగతి మందగించింది. అయితే 2013లో రాష్ట్ర విభజన చేసే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అని అదేదో అవశేష ఆంధ్రప్రదేశ్ కి భారీ బహుమతి ఇస్తున్నట్లు విభజన చట్టంలో పెట్టారు. తీరా చూస్తే విభజన జరిగి పదకొండు సంవత్సారాలు పూర్తయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. నిజానికి ఈ ప్రాజెక్టు ఎక్జిక్యూషన్ బాధ్యత అంతా కేంద్రానిది అయినప్పటికీ తమకు నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రన్ని కోరింది. అప్పటి ఏపీలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో భాగస్వామి కావడంతో ఈ ప్రొపోజల్‌ని కేంద్ర అంగీకరించింది. అయితే మధ్యలో టీడీపీకి బీజేపీకీ మధ్య స్పర్ధలు వచ్చి టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలగడంతో పోలవరం ప్రాజెక్టు పురగతి కూడా మందగించింది. ఆ తరువాత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక డయాఫ్రమ్ వాల్ నిర్మాణం లోపభుయిష్టంగా ఉందని గుర్తించి ఆ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్ళారు. ప్రస్తతం ఉన్న డయాఫ్రం వాల్ తో నిర్మాణ పనుల్లో ముందుకు వెళితే ప్రాజెక్టు మనుగడకే ప్రమాదం జరుగుతుందని ఆ సందర్భంలో వైఎస్.జగన్ ప్రధాని మోడీకి స్పష్టం చేశారు. దీంతో మళ్ళీ పోలవరం పనులు నిలిచిపోయాయి.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కెనడా నీటిపారుదల నిపుణుల సూచనలతో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ కు సమాంతరంగా ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్ డ్యాం) పనులు చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ సారి 2027 జూన్ నాటికల్లా పోలవరం నిర్మాణం పూర్తి చేసి కుడి, ఎడమ కాలువల్లో నీటిని పారించాలని చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ దశలో ప్రధాని కూడా పోలవరం విషయంలో కలగజేసుకుని స్టేక్ హోల్డర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించాలను కోవడం శుభ పరిణామాం. ఈ సమావేశంలో చత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రాలు ఎటువంటి అభ్యంతరాలను లేవనెత్తుతాయనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగడంతో ప్రాజెక్టుపై అభ్యంతరాలను లేవనెత్తుతున్న రాష్ట్రాలతో ఆయనే సయోధ్య కుదిర్చి పోలవరం పూర్తి చేస్తారన్న ఆశాభావం ఏపీ జల వనరుల శాఖ వ్యక్తం చేస్తోంది.
వాస్తవానికి 1950వ సంత్సరం నుంచి పోలవరం విషయంలో ముందడుగు పడినప్పటికీ 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు దివంగత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకూ ఈ ప్రాజెక్టును పట్టించున్న నాథుడే లేరు. పోలవరం విషయంలో వైఎస్‌ఆర్ తీసుకున్న నిర్ణయాలే ఈ రోజుకీ ఆ ప్రాజెక్టును సజీవంగా ఉంచాయి. అయితే రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత పోలవరం నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలో కి వచ్చిన తరువాత డాయఫ్రం వాల్ లో సమస్యను గుర్తించి నిర్మాణాన్ని కొనసాగించలేదు. 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడంతో పోలవరంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. తన హయాంలోనే పోలవరం నిర్మాణం పూర్తి చేసుకోవాలనే ఆకాంక్షతో ఇక స్వయంగా ప్రధానే తొలిసారి ఈ ప్రజెక్టుపై సమీక్ష నిర్వహిస్తుండటంతో ఇక పోలవరం నిర్మాణం సంపూర్ణం అవుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.