27.2 C
Hyderabad
Monday, November 2, 2026

Live Video

spot_img

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కొత్త ఫింగర్‌ప్రింట్‌ టెక్నాలజీ

రోజు రోజుకూ పెరుగుతున్న నేరాలను కట్టడి చేయడంతో పాటు.. నిందితులను గుర్తించేందుకు తెలంగాణ సర్కారు కొత్త టెక్నాలజీని అమలు చేయబోతోంది. ఇప్పటిదాకా వినియోగిస్తున్న ఫింగర్‌ ప్రింట్‌ టెక్నాలజీని అప్‌గ్రేడ్‌ చేసింది. కొత్తగా ఆటో మేటెడ్‌ మల్టీ మోడల్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్ (ఏఎంఎఫ్‌పీఐ) సిస్టంను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ఈ సరికొత్త టెక్నాలజీని వినియోగించబోతున్నారు. అప్‌డేట్‌ అవుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను సులభంగా, వేగంగా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని, పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఈ విధానాన్ని మొదట పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో కొన్ని ఎంపిక చేసిన పోలీస్‌స్టేషన్‌లలో అమలు చేశారు. ఆ పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కావడంతో ఇకపై విడతల వారీగా రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఈ టెక్నాలజీని వినియోగంలోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో దొంగతనాలు, హత్యలు, దాడులు.. ఇలా వివిధ రకాల నేరాలు జరిగినప్పుడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఫింగర్ ప్రింట్స్ సేకరించేవారు. ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్న నేరస్తుల ఫింగర్‌ ప్రింట్స్‌తో వాటిని పోల్చి.. ఇప్పటికే ఉన్న ఫింగర్‌ ప్రింట్స్‌తో పోలితే నిందితులు దొరికేవారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో నిందితులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇక, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆటోమేటెడ్ మల్టీమోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ (ఏఎంఎఫ్‌పీఐ) సిస్టం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో నేరస్తుల ఫింగర్ ప్రింట్స్‌తో పాటు ఇక నుంచి ఐరిస్‌, ఫేస్, ఫుట్ ప్రింట్స్ అంటే.. పాద ముద్రలు కూడా సేకరించి ప్రత్యేక డేటాబేస్‌లో భద్రపరుస్తారు. రాష్ట్రంలో ఎక్కడైనా దోపిడీలు, హత్యలు, ఇతర అఘాయిత్యాలు జరిగినప్పుడు నేర పరిశోధనలో భాగంగా అనుమానితుల ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, ఫేస్, ఫుట్ ప్రింట్స్‌ను సేకరించి, డేటా బేస్‌లో ఉన్న ప్రింట్స్‌తో పోల్చి చూస్తారు. దీంతో, నేర పరిశోధనతో పాటు నిందితులను గుర్తించడం ఇకనుంచి మరింత సులభం అవుతుందని పోలీసులు చెబుతున్నారు.

ఆటోమేటెడ్ మల్టీమోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ (ఏఎంఎఫ్‌పీఐ) సిస్టం దేశంలో ఇప్పటివరకు ఎక్కడా అమలులో లేదు. పారిస్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా తెలంగాణ ఫింగర్ ప్రింట్ విభాగాన్ని అప్ గ్రేడ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పారిస్‌లో నేరస్తులను గుర్తించేందుకు ఈ సిస్టం ఎంతగానో ఉపయోగపడుతుండగా, దేశంలో తొలిసారి తెలంగాణలో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు తెలంగాణలో మొదట నాలుగు పోలీస్‌ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా ఈ సిస్టంను అమలు చేశారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్‌లో రెండు స్టేషన్లు, సిద్దిపేట కమిషనరేట్‌లో ఒకటి, వరంగల్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో ఈ కొత్త టెక్నాలజీని అమలు చేసి పరీక్షించారు. ముందుగా ఆయా స్టేషన్ల సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అనంతరం వారు వివిధ నేరాలు జరిగినప్పుడు ఈ ఏఎంఎఫ్‌పీఐ సిస్టంను వినియోగించి సక్సెస్ అయ్యారు. దీంతో, ఈ సిస్టంను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు ఈ ఆటోమేటెడ్ మల్టీమోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు స్టేషన్లలో ఈ విధానం సక్సెస్ కాగా.. ఇప్పుడు విడత వారీగా రాష్ట్రమంతటా ఈ సిస్టంను విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా వరంగల్ కమిషనరేట్ లోని తొమ్మిది స్టేషన్లలో ఈ సిస్టంను వినియోగించేందుకు ఏర్పాట్లు చేశారు. వరంగల్ సెంట్రల్ జోన్ పరిధిలోని ఆరు స్టేషన్లు, ఈస్ట్ జోన్‌లో రెండు, వెస్ట్ జోన్‌లో ఒక స్టేషన్ ను ఎంపిక చేసి, మొదట వాటిలో వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ఫింగర్ ప్రింట్ వింగ్ నుంచి ఆటోమేటెడ్ మల్టీమోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టంకు సంబంధించిన పరికరాలు వరంగల్ కమిషనరేట్‌కు ఇప్పటికే చేరుకున్నాయి. వాటిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సంబంధిత ఫింగర్ ప్రింట్ విభాగం సిబ్బందికి అందజేశారు. ఇప్పటికే వరంగల్ కమిషనరేట్ సిబ్బందికి ఈ సిస్టంపై పూర్తిస్థాయిలో శిక్షణ అందించామని, ఇకపై నేరస్తులను పట్టుకోవడం మరింత సులువు అవుతుందని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ వివరించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com