- భారత్ లోనే ఐఫోన్ తయారీ యూనిట్ పెట్టే ఛాన్స్
- వీకరించిన ప్రభుత్వాధికారులు
- ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గని యాపిల్ కంపెనీ సీఈవో
- అమెరికాలో ఐఫోన్ ఒక్కోపీస్ తయారీ వ్యయం మూడింతలు
- మన దేశంలో అతి తక్కువ కాస్ట్ కే తయారీ
- దక్షిణాసియాలో తమ ట్రేడ్ ను విస్తరిస్తున్న యాపిల్ సంస్థ
- చైనా నుంచి మేజర్ సప్లయ్ చైన్ ఇక భారత్ కు
- సప్లయ్ చైన్ లో భాగస్వాములయ్యేందుకు కంపెనీల తహతహ
భారత్ లో ఐఫోన్ ల తయారీ కంపెనీ పెట్టొద్దంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యాపిల్ సిఈవో టీమ్ కుక్ కు స్పష్టమైన అభిప్రాయం చెప్పినా,యాపిల్ కంపెనీ తయారీదార్లు మాత్రం మనదేశంలో దాని విస్తరణ యూనిట్ పెట్టేందుకే అడుగు ముందు కేశారు. నిజానికి భారత్ లో విస్తరణ యూనిట్ పెట్టాలన్నది చాలా కాలం క్రితమే తీసుకున్న నిర్ణయమని, వారికి అనేక ప్రయోజనాలున్నాయనీ ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.అందువల్ల కేవలం ట్రంప్ మాటలు పట్టుకుని వారు ఐఫోన్ తయారీ యూనిట్ ను మన దేశంలో పెట్టకుండా పోరని వారు విశ్లేషిస్తున్నారు.మరోవైపు ఈ కంపెనీకి చెందిన భాగస్వాములందరినీ తాము నిశితంగా ప్రశ్నించినట్లు వారు ఒక క్రమ పద్దతిలో పనులు చేసుకుంటూముందుకు వెళుతున్నారని ప్రభుత్వాధికారులంటున్నారు.మరోవైపు యాపిల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ కూడా భారత ప్రభుత్వాధికారులతో మాట్లాడారని వారికి అతిపెద్ద యూనిట్ భారత్ లోనే పెట్టాలని నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
ట్రంప్ హెచ్చరించినా…
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై టారిఫ్ల జూలు విదిల్చి ట్రేడ్ వార్ కు తెర తీసిన ట్రంప్ ఇప్పుడు యాపిల్ కంపెనీ సీఈఓ టీమ్ కుక్ పై ఒత్తిడి తెస్తున్నారు. భారత్ లో ఐఫోన్ల తయారీ యూనిట్ పెట్టొద్దని అది అమెరికాలో మాత్రమే పెట్టాలనీ పట్టుబడుతున్నారు. అమెరికాలో 500ల బిలియన్ల డాలర్ల విలువైన ఐఫోన్ల తయారీ కంపెనీ పెట్టాలని తాను కోరినట్లు అందుకు కుక్ అంగీకరిస్తారని నమ్ముతున్నట్లు ట్రంప్ ప్రకటన చేశారు. అయితే అందుకు భిన్నంగా యాపిల్ కంపెనీ ఓనర్లు భారత్ లోనే అతిపెద్ద ఐఫోన్ తయారీ యూనిట్ పెట్టాలని దానితో పాటు దేశం నలుమూలల బ్రాంచీలు పెట్టాలనే తలంపుతో ముందుకొచ్చారు. ఐ ఫోన్ల తయారీ కంపెనీ అమెరికాలో పెట్టడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని యాపిల్ కంపెనీ భావిస్తోంది. అంత ఖర్చు తాము భరించే స్థితిలో లేమని ఆ కంపెనీ అంటోంది.
తయారీ వ్యయం తడిసి మోపెడు..
అమెరికాలో యాపిల్ కంపెనీ ఐఫోన్ల ప్రొడక్షన్ మొదలు పెడితే ఒక్కో ఫోన్ తయారీ ధర మూడు వేల డాలర్లు పడుతుంది. మామూలుగా ఐఫోన్ తయారీ వ్యయం వెయ్యి డాలర్లు.అంటే ఒక్కో ఫోన్ పైనా మూడింతలు అదనపు భారం పడుతుంది. అంత ధర పెట్టి యావరేజ్ అమెరికన్ వినియోగదారుడు ఐఫోన్ కొనే అవకాశం ఉండదు.రేటు అంత ఎక్కువగా పెరిగితే వాటికి డిమాండ్ పడిపోతుంది.భారత్, చైనా, వియత్నాంలలో ఎక్కడ ఆ యూనిట్ పెట్టినా ఒక్క ఫోన్ తయారీ వ్యయం వెయ్యి డాలర్లు మాత్రమే అవుతుంది.ప్రస్తుతం యాపిల్ కంపెనీ ఫోన్ల తయారీ 80 శాతం చైనాలో జరుగుతోంది.ఈ కంపెనీ వల్ల అక్కడ 50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఐఫోన్ల తయారీ యూనిట్ భారత్ లో పెడతామని ప్రకటించడం అంటే చైనా నుంచి సగం తయారీ యూనిట్ ను భారత్ లో పెట్టి సప్లయ్ చైన్ ను విస్తరించుకోవడమే. యాపిల్ తయారీ యూనిట్ అమెరికా నుంచి భారత్ కు షిఫ్ట్ అవ్వడం లేదు. చైనానుంచి భారత్ కు మారుతోంది. దీనివల్ల తమతో వ్యాపార భాగస్వామ్యం లేని, ట్రేడ్ వార్ సాగిస్తున్న చైనా ఆధిపత్యం ఉండబోదని అమెరికన్ వినియోగ దార్లు కూడా సంతోషిస్తారు.యాపిల్ కంపెనీ అనేక మంది భాగస్వాములతో కలసి భారత్ లో తన యూనిట్ ను విస్తరిస్తోంది. ఐఫోన్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ లో 15 శాతం భారత్ నుంచే వస్తోంది. తైవాన్ కాంట్రాక్ట్ తయారీ దారు ఫాక్స్ కాన్ కంపెనీ ఐఫోన్లకు అతిపెద్ద సప్లయర్ గా ఉంది. ఆ సంస్థ తన సప్లయ్ ను తగ్గించుకుని భారత్ లో యాపిల్ కంపెనీ విస్తరణకు తోడ్పడేందుకు ముందుకొచ్చింది. అలాగే ఇతరభాగస్వామ్య కంపెనీలైన టాటా ఎలక్ట్రానిక్స్ కూడా దేశంలో తమ ఆపరేషన్స్ ను ఉథృతంగా విస్తరించాలని చూస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన క్యుపర్టినో కంపెనీ భారతీయ కంపెనీలతో చర్చలు మొదలు పెట్టింది. ఈ సప్లయ్ చైన్ లో భాగస్వామి అయ్యేందుకు తహతహలాడుతోంది.
అంతా మేకిన్ ఇండియా మహిమే…
సాధారణంగా ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండే ప్రాంతాలకే కంపెనీలు తరలి వెళ్లి గట్టి పోటీ నిస్తాయి. ఎక్కడైనా వ్యాపారసూత్రం ధర, ఆదాయం, లాభం ప్రాతిపదికనే ఆధారపడి ఉంటుంది.కాబట్టి మేకిన్ ఇండియా ప్రాజెక్టు ద్వారా భారత్ తన సత్తాని, తన ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పింది. అనేక కంపెనీల యూనిట్ల విస్తరణకు భారత్ ఒక ఆకర్షణీయమైన కేంద్రమని, మేకిన్ఇండియా ద్వారా మరింత మంది తయారీ దార్లను, యూనిట్లను ఆకర్షిస్తుందని మరోవైపు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి ట్రంప్ హెచ్చరికలను లేదా వాదాన్ని పట్టించుకోని యాపిల్ కంపెనీ భారత్ లో తన విస్తరణను మరింత త్వరగా ప్రారంభించే అవకాశముంది.మరోవైపు సప్లయర్లు ఎవరికీ వారి కంపెనీ యూనిట్లను భారత్ లో పెట్టొద్దన్న సంకేతాలేవీ ఇప్పటి దాకా వెలువడలేదు. అంతా పక్కా ప్లాన్ ప్రకారమే యాపిల్ కంపెనీ ఐఫోన్ల తయారీ విస్తరణ యూనిట్ దేశంలో ప్రారంభం కాబోతోంది.
జూన్ నెల నాటికి అమెరికాలో అమ్ముడైన అన్ని ఐఫోన్లకు భారత్ తయారీ దారుగా ఉంటుందని, అలాగే మిగిలిన దేశాలలో అవసరానికి తగ్గట్లుగా ఉత్పత్తి చైనాలో జరుగుతుందని టీమ్ కుక్ ప్రకటించారు. అయితే ట్రేడ్ వార్ కొనసాగుతున్న ఈ టైమ్ లో ఏం జరుగుతుందో చూడాలి. ఫాక్స్ కాన్ కంపెనీ యాపిల్ ఎయిర్ పాడ్స్ తయారీ యూనిట్ ను ఇప్పటికే తెలంగాణలో ప్రారంభించింది.
ఎస్ అండ్ పీ గ్లోబల్ సంస్థ విశ్లేషణ ప్రకారం 2024 లోఅమెరికాలో ఐఫోన్ సేల్స్ 75.9 మిలియన్ యూనిట్లుగా అంచనా వేశారు.మార్చి నెలలో భారత్ నుంచి ఎగుమతులు3.1 మిలియన్ యూనిట్లుగా ఉండటంతో షిప్ మెంట్లు రెట్టింపు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.2025 ఆర్ధిక సంవత్సరంలో ఈ ఏప్రిల్ నెలలోనే 1.5 లక్షల కోట్ల ఐఫోన్లు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి.
యాపిల్ కంపెనీ ఉపాధి అవకాశాలు కల్పించడంలో అతిపెద్ద తిరుగులేని సంస్థ. దాదాపు రెండు లక్షల మంది ఈ కంపెనీ ద్వారా వివిధ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు.