నారా లోకేశ్‌కు త్వరలో కీలక పదవి లభించే అవకాశం ఉందంటున్నారు టీడీపీ ముఖ్యనేతలు. పార్టీ నేతలు, కార్యకర్తలు కొంత కాలంగా సోషల్ మీడియాలో చేస్తున్న డిమాండ్‌లకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఉందంటున్నారు. ఈ నెలాఖరులో కడప జిల్లాలో జరగనున్న టీడీపీ మహానాడులో దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్, మరింత కీలక పదవిని చేపట్టనున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. కార్యకర్తలు లోకేశ్ నాయకత్వాన్ని కోరుకుంటుండటంతో పార్టీ ఆయనకు బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అధికారికంగా నిర్ణయం ఇంకా వెలువడకపోయినా మహానాడు వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నారా లోకేశ్ ఇటీవలి కాలంలో పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రభుత్వ విధానాల అమలులోనూ, కార్యకర్తలతో మమేకం కావడంలోనూ సక్సెస్ అవుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే యువతతో లోకేశ్‌కు ఉన్న బలమైన కనెక్షన్‌ను ఉపయోగించుకోవాలని టీడీపీ నేతలు చూస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండడంతో చంద్రబాబు పార్టీ కార్యకలాపాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో లోకేశ్ కీలక భాద్యతలు చేపడితే పార్టీ గాడిలో పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఉప ముఖ్యమంత్రి పదవి అంశం గతంలో వినిపించినా, ఆ డిమాండ్‌ను పక్కన బెట్టేశారు. అయితే, పార్టీలో భవిష్యత్తు నాయకత్వం లోకేశ్‌దే అనే అభిప్రాయం బలపడుతోంది. పార్టీ పరంగా లోకేశ్‌ను ముందుకు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేతలు, ఆయనకు కీలక పదవిని అప్పగించాలనే డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్నారు. మహానాడులో ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. పార్టీ అధికారిక వ్యవస్థలో లోకేశ్ పాత్రను బలపర్చే దిశగా చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈరోజు జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.