29.9 C
Hyderabad
Saturday, October 31, 2026

Live Video

spot_img

బీఆర్‌ఎస్‌లో కుర్చీలాట

భారత రాష్ట్ర సమితిని అంతర్గత వివాదాలు, నాయకత్వ ఆధిపత్యం చుట్టుముట్టాయన్న చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాలకు దూరంగా ఉండే దిశగా అడుగులు వేస్తున్నారన్న అంచనాలు బలపడుతున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్‌ను ప్రకటించే సమయం దగ్గరపడిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

పార్టీ వ్యవహారాల్లో హరీష్ రావు ప్రాధాన్యం తగ్గడం, కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు భిన్నంగా ఉండటం, బీఆర్ఎస్‌లోని ముగ్గురు కీలక నేతల మధ్య పగ్గాల పోటీ తారాస్థాయికి చేరిందన్న చర్చ జరుగుతోంది. 2023 ఎన్నికలలో పార్టీకి ఎదురైన పరాజయం తర్వాత కేసీఆర్ రాజకీయంగా చురుగ్గా లేరు. ఇది తాత్కాలిక విరామం కాదని, ఆయన పూర్తిగా రాజకీయ సన్యాసానికే సిద్ధమవుతున్నారన్న సంకేతాలుగా భావిస్తున్నారు.

కేటీఆర్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడానికి రంగం సిద్ధమవుతోందన్న వార్తలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల వరంగల్‌లో జరిగిన పార్టీ వార్షికోత్సవంలో హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టి కేటీఆర్‌కు ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. దీంతో హరీష్ రావు తన రాజకీయ భవిష్యత్తు గురించి స్వతంత్రంగా ఆలోచించేందుకు డిసైడ్‌ అయ్యారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కవిత తన వ్యక్తిత్వాన్ని పార్టీ వ్యతిరేక దిశగా వినిపించుకుంటున్నారు. తాజాగా ఆమె రామానుజపురంలో నాంచారమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోది చెప్పే నాంచారమ్మలు కవిత భవిష్యత్ లో తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. వారి మాటలను చిరునగవుతో విన్న కవిత జై తెలంగాణ అంటూ నినదించారు. ఈ సంఘటన యథాలాపంగా జరిగింది కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆమె సామాజిక తెలంగాణ సాధన ఇంకా మిగిలే ఉందంటూ చేసిన వ్యాఖ్యకు దీనిని జోడించి సొంత సోదరుడు కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారంటున్నారు.

ఇక, హరీష్ రావు కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా భిన్న విశ్లేషణలు వస్తున్నాయి. సందర్భంతో సంబంధం లేకుండా తాను కేసీఆర్ ఎవరికి పగ్గాలు అప్పగించినా స్వాగతిస్తానంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయనలోని అసంతృప్తికి, అసహనానికీ తార్కానంగా చెబుతున్నారు. అదే సమయంలో హరీష్ పార్టీ తదుపరి అధ్యక్షుడి విషయం లేవనెత్తడాన్ని కేసీఆర్ పోలిటికల్ రిటైర్మెంట్ కు రెడీ అయిపోయారన్న సంకేతాన్ని ఇవ్వడమేనని చెబుతున్నారు. మరోవైపు, పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా కేటీఆర్‌కు మద్దతు ఇవ్వబోమన్న పార్టీ నేతలు ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవిని కేటీఆర్‌కు అప్పగిస్తే అంగీకరిస్తారా? అన్నది ప్రశ్నార్థకమయ్యింది. కేసీఆర్ నాయకత్వం ఉన్నంత వరకూ ఎవరూ ప్రశ్నించకపోయినా, ఆయన తప్పుకుంటే పార్టీలో ప్రశ్నించేవాళ్లు ఎక్కువయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చీలిక తప్పదన్న అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల్లో వినిపిస్తున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com