కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కసి తీర్చుకున్నారు. కడపలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా మాధవి రెడ్డి గెలిచారు. గెలిచింది ఒకేసారి అయినప్పటికీ ఆమె నిత్యం వార్తల్లో ఉంటున్నారు. కడప రెడ్డమ్మగా ఆమె దూకుడుతో వ్యవహరిస్తున్న తీరు కొన్ని సార్లు విమర్శలకు దారితీస్తున్నా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. మాధవిరెడ్డి కడప జిల్లా టీడీపీలో లీడర్ గా ఎదుగుతున్నారు. కడప జిల్లా వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కావడంతో మాధవీరెడ్డికి టీడీపీ కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తోంది.
తాజాగా కడప మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగించి తన పవర్ ఏంటో మాధవిరెడ్డి చూపించగలిగారు. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వేదికపై కుర్చీ ఇవ్వనంందుకు చివరకు మేయర్ కుర్చీనే లాగేశారు. మున్సిపల్ నిబంధనలను అడ్డుపెట్టి మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగించారు. మేయర్ సురేష్ బాబు తన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న సంస్థకు అరవై లక్షల రూపాయల కాంట్రాక్ట్ పనులు అప్పగించారన్న ఆరోపణల నేపథ్యంలో మేయర్ సురేష్ బాబుపై వేటు వేసింది.
మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏడు నియోజకవర్గాల్లో గెలిచింది. పది శాసనసభ నియోజకవర్గాలున్న కడప జిల్లాలో తొలిసారి కూటమి పార్టీలకు ఇంతటి పెద్ద స్థాయిలో విజయం లభించింది. గతంలో ఇన్ని స్థానాలను టీడీపీ ఎప్పుడూ గెలవలేదు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. కడపలో 1999లో గెలిచిన తర్వాత మళ్లీ టీడీపీ గెలిచింది 2024 లోనే. దాదాపు రెండున్నర దశాబ్దం కడప నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురలేదనే చెప్పాలి. ఈసారి మాధవిరెడ్డి గెలిచి తన సత్తా చాటారు. దీంతో ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని భావించినా కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు.
మాధవిరెడ్డి భర్త కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి. తొలి నుంచి ఆయన కుటుంబం టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన కుటుంబంగా పేరుంది. జగన్ సొంత జిల్లాలో అదీ కడపలో గెలవలేకపోయినా పార్టీ జెండాను రెడ్డప్పగారి కుటుంబం వదిలి పెట్టలేదు. ఈసారి తన సతీమణి మాధవరెడ్డికి టిక్కెట్ తెచ్చుకుని మరీ గెలిపించుకున్నారు. మాధవిరెడ్డి గెలిచిన దగ్గర నుంచి స్పీడ్ గానే ఉన్నారు. కార్పొరేషన్ లో కుర్చీ కోసం చేస్తున్న గలాటా కూడా కొంత కాంట్రవర్సీగా మారినా ఆమె వెనక్కు తగ్గలేదు. కార్పొరేషన్ సమావేశంలోనే మాధవి రెడ్డి శపథం చేశారు. తనకు వేదికపై కుర్చీ వేయని నువ్వు కుర్చీలో ఉలా ఉంటావో చూస్తానంటూ వెళ్లిపోయారు. అనుకున్నట్లే మాధవి రెడ్డి అనుకున్నది సాధించారు.
మాధవి రెడ్డి ద్వారానే వైసిపిని టార్గెట్ చేయాలని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. అందుకే అమెకు అన్ని విధాలుగా పార్టీ నాయకత్వం సహకరిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.