డైరెక్టర్, హీరో, నిర్మాతగా తేజ్ తెరకెక్కిస్తున్న త్రిభాషా చిత్రం “డ్యూడ్”పై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆ పేరునే మరో చిత్రానికి వినియోగించబోతున్నట్లు ప్రకటించడంపై తేజ్ ఆశ్చర్యం, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా టైటిల్‌ను ఏడాది క్రితమే రిజిష్టర్ చేసి ప్రచారంలో పెట్టామని తేజ్ పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ వంటి అగ్ర సంస్థతో విభేదించాలన్న ఉద్దేశ్యం లేదని, ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ఫుట్ బాల్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. భావోద్వేగాలతో కూడిన స్టోరీతో పాటు, ఈ సినిమాను స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు అంకితంగా రూపొందిస్తున్నారు. ఫుట్ బాల్ కోచ్ పాత్రలో రంగాయన రఘు నటిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఆగస్టు లేదా సెప్టెంబర్లో విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్ స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా కూడా పని చేస్తున్నారు. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష వంటి నటీమణులు ఫుట్ బాల్ ఆటగాళ్లుగా కనిపించనున్నారు. సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి పి.ఆర్.ఒలుగా ధీరజ్, అప్పాజీ వ్యవహరిస్తుండగా, “జింకే మారి” ఫేమ్ ఎమిల్ మహమ్మద్ సంగీతం అందిస్తున్నారు. “అలా మొదలైంది” ఫేమ్ ప్రేమ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.