ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత తీవ్రంగా మన సైన్యం వారి మూలాలకు బుద్ధి చెప్పిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు. భారత జవాన్ల సాహసం, పరాక్రమానికి సెల్యూట్ కొడుతున్నానన్నారు. పాకిస్థాన్‌ను ఉద్దేశించి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే అది సహించదగిన విషయం కాదని, ‘న్యూక్లియర్ బ్లాక్‌మెయిలింగ్’ను ఇకపై సహించబోమని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య భారత్ నిర్ణయాల ప్రకారమే చర్చలు సాగుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదులపై భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గడచిన నాలుగు రోజులుగా భారత రక్షణదళాల ధైర్యం, శక్తిని దేశం చూసిందని మోదీ చెప్పారు. నిఘా వర్గాల చురుకుతనం, శాస్త్రీయ సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించిందని ప్రశంసించారు. పహల్గాంలో మతం పేరుతో ఉగ్రవాదులు కుటుంబ సభ్యుల ముందే భారత పౌరులను కాల్చిచంపిన ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిందన్నారు.
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత మిసైళ్లు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యాలపై దాడులు చేశాయని, బహావల్‌పుర్, మురుద్కే వంటి తీవ్రవాద స్థావరాలపై దాడులు చేసి పాక్‌ను భయంకరంగా కలవరపెట్టామన్నారు. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతోపాటు, పాక్ గర్వించే మిసైళ్లను నాశనం చేశామని చెప్పారు. భారత్ చర్యలతో బెంబేలెత్తిన పాకిస్థాన్ కాల్పుల విరమణ కోసం ప్రపంచ దేశాలను వేడుకోవాల్సి వచ్చిందని, వారి డీజీఎంవో చర్చల కోసం తడబడుతూ ప్రతిపాదించారని వివరించారు.
రెండున్నర దశాబ్దాలుగా పాక్‌లో స్వేచ్ఛగా తిరిగిన ఉగ్రవాద అడ్డాలను భారత్ ఒక్కదెబ్బతో తుడిచిపెట్టిందని మోదీ అన్నారు. పాకిస్తాన్ మన సరిహద్దుల్లోని పాఠశాలలపై దాడులకు దిగిన సమయంలో.. అక్కడి డ్రోన్లు, మిసైళ్లను భారత రక్షణ వ్యవస్థ సరిహద్దులు కూడా దాటకుండానే కూల్చేసిందని చెప్పారు. పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలను భారత మిసైళ్లు ధ్వంసం చేశాయని వివరించారు.
సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలు భారత్ ఉగ్రవాదంపై తీసుకున్న స్పష్టమైన వైఖరికి నిదర్శనమన్నారు. ఉగ్రవాదంపై చర్చలు కేవలం షరతుల మేరకే జరుగుతాయని స్పష్టం చేశారు. భారత్ రక్షణ దళాల సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ సామర్థ్యాన్ని ప్రపంచం చూసిందని చెప్పారు. మేడిన్ ఇండియా రక్షణ వ్యవస్థల బలాన్ని నిరూపించామని వివరించారు.
ఈ యుగం యుద్ధాలకోసమో, ఉగ్రవాదానికో కాదని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఎవరినీ భారత్ ఉపేక్షించదని, అలాంటి శిబిరాలను పాక్ స్వయంగా ధ్వంసం చేయాలని సూచించారు. టెర్రరిజం, చర్చలు రెండూ ఏకకాలంలో సాధ్యపడవని, రక్తం, నీరు ఒకేచోట ప్రవహించలేవని చెప్పారు. చర్చలు జరగాలంటే అది పాక్ ఆక్రమిత కశ్మీర్, ఉగ్రవాదంపై మాత్రమేనని స్పష్టం చేశారు.