ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మిగా భావిస్తారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య తగ్గుతూ పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర హోం శాఖకు చెందిన జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయంలో వార్నింగ్ బెల్స్ మోగించింది. 2019లో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 953 మంది ఆడ శిశువులు జన్మించగా, 2021 నాటికి ఈ సంఖ్య 922కి పడిపోయింది. ఇది తెలంగాణలో లింగ సమతుల్యతపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో జననాల రేటు గ్రామీణ ప్రాంతాల కంటే రెండింతలు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 1.96 లక్షల మంది పిల్లలు జన్మించగా, పట్టణాల్లో ఈ సంఖ్య 4.15 లక్షలకు చేరింది. మొత్తం జననాల్లో మగ శిశువులు 3.18 లక్షలు కాగా, ఆడ శిశువులు 2.93 లక్షలు మాత్రమే.
ఇక మరణాల పరంగా 2021లో కరోనా ప్రభావంతో మరణాల సంఖ్య 15.4 శాతం పెరిగింది. ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2.34 లక్షల మంది మృతిచెందగా, వారిలో పురుషులు 1.35 లక్షలు, మహిళలు 98 వేల మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.08 లక్షల మరణాలు చోటు చేసుకోగా, పట్టణాల్లో 1.26 లక్షల మంది మరణించారు. నవజాత శిశు మరణాల విషయానికి వస్తే, పట్టణాల్లో మరణాల రేటు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. శిశు మరణాల్లో హైదరాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, పెద్దపల్లి రెండో స్థానంలో ఉంది. వయస్సు ఆధారంగా పరిశీలిస్తే, 55 ఏళ్లకు పైబడిన వారు 76 శాతం మరణించినవారిగా నమోదయ్యారు. 35-44 ఏళ్ల వయస్సు వారు 12 వేల మంది, 45-54 మధ్యవయస్సు వారు 22 వేల మంది, 55-64 వయస్సు వారు 42 వేల మంది, 65-69 మధ్యవయస్సు వారు 85 వేల మంది, 70 ఏళ్లకు పైబడిన వారు 51 వేల మంది మరణించారు.
2021లో రాష్ట్రంలో మొత్తం 6.11 లక్షల మంది పిల్లలు జన్మించగా, అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 95,666 మంది జన్మించారు. ములుగు జిల్లాలో మాత్రం అత్యల్పంగా కేవలం 3,868 మంది జన్మించారు. హైదరాబాద్ తర్వాత మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు జననాల్లో అగ్రస్థానాల్లో ఉన్నాయి.