తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్‌పై భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రభావం పడింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మావోయిస్టుల వేటకు తాత్కాలిక విరామం ఇస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఆర్మీ బలగాలు కర్రెగుట్టలో చేపట్టిన ఆపరేషన్ కగార్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కర్రెగుట్టను జల్లెడ పడుతున్న CRPF బలగాలను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. సుమారు 5వేల మందికి పైగా బలగాలను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. తెలంగాణ సరిహద్దులోని హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని CRPF కోబ్రా జవాన్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత్-పాక్ వార్ నేపథ్యంలో కర్రెగుట్టల నుండి బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి రేపు ఉదయంలోపు భారత్- పాక్ సరిహద్దుల్లోకి సీఆర్‌పీఎఫ్ బలగాలు వెళ్లనున్నాయి. CRPF బలగాలు వెనక్కి వెళ్తుండడంతో ఏజెన్సీ గ్రామాలు రిలాక్స్ అయ్యాయి.
మావోయిస్టు నేత జగన్ కాల్పుల విరమణ ప్రకటించిన 24 గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం గమనార్హం. మావోయిస్టులకు కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టైంది. పోలీసు బలగాలు వెనక్కివెళ్లటంతో మావోయిస్టులకు ఉపిరి పీల్చుకున్నంత పనైంది. తిరిగి బలగాలు దండకారణ్యానికి చేరుకునే సమయానికి వర్షాలు ప్రారంభమై అడవి పచ్చదనం సంతరించుకుంటుంది. ఆపరేషన్ తిరిగి మొదలయ్యే లోపు మావోయిస్టులు వారి వ్యూహాలు, షెల్టర్ జోన్లు సిద్దం చేసుకునేందుకు సమయం దొరికింది.