29.2 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

అగ్నివీర్‌ అమరుడైతే పరిహారం ఎంతొస్తుంది?

ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. యుద్ధం, దాడులు, ప్రత్యర్థి కుతంత్రాలను తిప్పి కొట్టడం, విజయం, దరహాసం గురించి చెప్పుకుంటున్నాం సరే.. మరి.. ఈ మొత్తం గర్వానికి, విజయానికి కారకులుగా నిలుస్తోన్న సైనికులు అమరులైతే వాళ్ల గురించి కూడా చెప్పుకోవాలి. అలా.. భారత సైన్యంలో అగ్నివీర్‌గా విధులు నిర్వర్తిస్తూ అమరుడైన సైనికుడి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. అయితే.. ఇది సాధారణ జవాన్ అమరుడైతే లభించే పరిహారంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, జీవిత బీమా, ఎక్స్‌గ్రేషియా, మిగిలిన సర్వీసు జీతం, సేవా నిధి ప్యాకేజీ, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుంచి అదనపు సహాయం, తక్షణ ఆర్థిక సహాయం వంటి పలు మార్గాల్లో ఆ కుటుంబానికి ఆర్థిక అండ లభిస్తుంది. ఈ మొత్తాలన్నింటిని కలిపితే సుమారు రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు అమర సైనికుల కుటుంబానికి పరిహారం అందుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

పాకిస్తాన్‌ దాడుల నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం చోటుచేసుకున్న కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తాండ పంచాయతీలోని కళ్లితండాకు చెందిన మురళీ నాయక్ అనే అగ్నివీర్ అమరుడయ్యాడు. సాధారణంగా భారత త్రివిధ దళాల్లో విధుల్లో అమరులయ్యే సైనికులకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల సహాయాలు, గౌరవాలు, అవార్డులు అందిస్తుండగా, 2020లో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం ద్వారా జవాన్లు కేవలం నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే సర్వీసు చేస్తారు. ఆ తర్వాత వారిలో 25 శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సైన్యంలో కొనసాగించి మిగిలిన వారిని విధుల నుంచి తప్పిస్తారు. అగ్నిపథ్ పథకం కింద విధుల్లో ఉన్న అగ్నివీర్ అమరుడైతే ఏ విధంగా ప్రభుత్వ సహాయం అందుతుందో ఇప్పుడు చూద్దాం.

అగ్నిపథ్ పథకం కింద చేరిన ప్రతి అగ్నివీర్‌కు రూ.48 లక్షల విలువైన జీవిత బీమా లభిస్తుంది. ఇది శిక్షణ సమయంలోనైనా, యుద్ధ సమయంలోనైనా, సహజ మరణానికి అయినా వర్తిస్తుంది. ఈ బీమా ప్రీమియంను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. విధి నిర్వహణలో భాగంగా అమరుడైతే అదనంగా రూ.44 లక్షల ఎక్స్‌గ్రేషియాను కూడా ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తం జీవిత బీమా మొత్తానికి అదనంగా చెల్లించబడుతుంది.

అగ్నివీర్ తన నాలుగేళ్ల సర్వీసు సమయంలో ఎంతకాలం మిగిలి ఉందో దాన్ని లెక్కించి, మిగిలిన కాలానికి సంబంధించిన జీతాన్ని ఒకేసారి కుటుంబానికి చెల్లిస్తారు. సేవా నిధిగా అగ్నివీర్ జీతం నుంచి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సమాన మొత్తాన్ని జమ చేస్తారు. నాలుగేళ్ల సేవా కాలం పూర్తయిన తర్వాత ఈ మొత్తం వడ్డీతో కలిపి అగ్నివీర్‌కు చెల్లిస్తారు. కానీ సైనికుడు మధ్యలోనే అమరుడైతే, వెంటనే ఆ మొత్తం కుటుంబానికి అందుతుంది. ఈ మొత్తంపై ఎలాంటి ఆదాయ పన్ను ఉండదు.

అగ్నివీర్ అమరుడైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుంచి కూడా ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ నిధి నుంచి అందే మొత్తం పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. అంతేగాక, అంత్యక్రియలు, తక్షణ అవసరాల కోసం వెంటనే కొంత మొత్తం ఆర్థిక సహాయంగా అందజేస్తారు.

ఈ అన్ని మార్గాల్లో లభించే ఆర్థిక సాయాన్ని కలిపితే అగ్నిపథ్ కింద సైన్యంలో చేరిన అగ్నివీర్ సర్వీసులో అమరుడైతే వారి కుటుంబానికి సుమారు రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇది కూడా అప్పటి పరిస్థితులు, వర్తించే నిబంధనల ప్రకారం మారుతుంది. ఈ మొత్తం కన్నా అదనంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ స్థాయిలో పరిహారాలు ప్రకటించవచ్చు. దేశం కోసం అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి అమరులైన అగ్నివీరులకు గ్యాలంట్రీ అవార్డులు లభించే అవకాశం ఉంటుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com