ఆపరేషన్ సింధూర్ దక్షిణాసియా భౌగోళిక స్వరూపాన్ని మార్చబోతోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదట ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటమే లక్ష్యంగా ఆరంభమైన ఆపరేషన్ సింధూర్… క్రమంగా పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమిస్తోంది.
భారత్‌కు సమాధానం ఇస్తామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ప్రకటించటం వివాదాన్ని మరింత రాజేస్తోంది. భారత్‌లో అలజడి సృష్టిస్తున్న ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌లో లెక్కకు మించి ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. కార్గిల్ యుద్ధం తర్వాత మరోసారి యుద్ధం జరుగుతున్న వేళ రెండు దేశాల సామర్థ్యంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఆక్రమిత కశ్మీర్, పంజాబ్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన క్షిపణుల వర్షం కురుపించింది. అందుకు ప్రతిగా పాకిస్తాన్ మన సరిహద్దుల్లో మోర్టర్లతో దాడులకు దిగుతోంది. దీంతో భారత వాయుసేన ఆ దేశ వాయుసేన వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది.
ఈ తరుణంలో బలుచిస్తాన్‌లో తిరుగుబాటుదారులు పాకిస్తాన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులు ఎక్కడ కనిపిస్తే అక్కడ దాడులకు దిగుతున్నారు. ఇప్పటికే బెలుచిస్తాన్లో విధులు నిర్వహించేందుకు జంకుతున్న పాక్ సైన్యానికి తాజా దాడులు కలవరపెడుతున్నాయి.
బలూచ్ తిరుగుబాటుదారులను అణచివేసేందుకు, తెహ్రిక్ ఏ తాలిబాన్ తిరుగుబాటు సంస్థను కట్టడి చేసేందుకు బలుచిస్తాన్, ఖైభర్ పంక్తూంఖ్వా రాష్టాల్లో సైన్యాన్ని భారీగా మొహరించారు. తాజాగా భారత్ దాడులకు దిగటంతో అక్కడ నుంచి ఆక్రమిత కశ్మీర్, పంజాబ్ వైపు బలగాలను తరలిస్తున్నారు.
ఇదే అదునుగా బలూచ్ తిరుగుబాటుదారులు పాక్ సైన్యంపై దాడులకు దిగుతున్నారు. పాకిస్తాన్ సైన్యం, చైనా పౌరులు కనిపిస్తే బలూచ్ యువత దాడులకు యత్నిస్తున్నారు. పురుషులకు మద్ధతుగా మహిళలు కూడా పెద్దసంఖ్యలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. ఈ రాష్ట్రం నుంచి ఖనిజ సంపద కొల్లగొడుతున్న పాకిస్తాన్, చైనా స్థానికంగా అభివృద్ధి చేయటం లేదని స్థానికులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
రాజధాని క్వెట్టా, పంజ్గూర్, ముస్తాంగ్, కుజ్దర్, గ్వదార్, అఫ్గన్ సరిహద్దు పట్టణం చమన్ ప్రాంతాలు మాత్రమే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నాయి. బలుచిస్తాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పాక్ చట్టాలకు విలువ లేదు. స్థానిక నేతలు, బిఎల్ఏ సానుభూతిపరులదే పెత్తనం.
మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని వేర్పాటువాదులుగా ముద్రవేసి అరెస్టు చేస్తున్నారు. కొన్ని చోట్ల యువతను కిడ్నాప్ చేసి చంపేస్తున్నారని పాక్ సైన్యంపై ఆరోపణలు ఉన్నాయి.
1971లో 13 రోజుల యుద్ధంతో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఈ దఫా యుద్ధం నెల రోజులపాటు సాగితే పాక్ ఆర్థికవ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఉంది. ఇదే జరిగితే బలుచిస్తాన్ లో తిరుగుబాటు తీవ్రం కానుంది. తాజాగా బిఎల్ఏ నాయకుడు మీర్ యార్ బలూచ్ స్వాతంత్రం వచ్చిందని ప్రకటించారు.
2016 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బలుచిస్తాన్ పోరాటానికి మద్దతు తెలిపారు. అప్పటి నుంచి బలూచ్ ప్రజల్లో భారత్‌పై ఎన్నో ఆశలు ఉన్నాయి. తెగించి పోరాడితే ఏదో ఒక రోజు భారత్ అండగా ఉంటుందని బలూచ్ ప్రజలు నమ్మకంతో ఉన్నారు.
ఈసారి భారత్ పాక్ యుద్ధం బలుచిస్తాన్ ఆవిర్భావానికి బీజం వేస్తుందని పాక్ రాజకీయ వర్గాలు, అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.