34.2 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

15 నగరాలపై పాక్ క్షిపణి దాడులకు యత్నం…!!

  • సకాలంలో తిప్పి కొట్టిన రక్షణ దళాలు
  • బుధవారం అర్ధరాత్రి దాటాక పాక్ దుస్సాహసం
  • గుజరాత్ తదితర ప్రాంతాల్లో క్షిపణి శకలాలు
  • పాక్ దాడుల ఆధారాలను సేకరించిన భారత్
  • జమ్ము, కశ్మీర్, పంజాబ్, గుజరాత్
  • శ్రీనగర్,పఠాన్ కోట్,అమృత్ సర్, లూథియానా, చండీగఢ్
  • పాకిస్థానీ ఎయిర్ డిఫెన్స్ రాడార్స్,వ్యవస్థలపై భారత్ దాడులు
  • భారత్ కు కలిసొస్తున్న అత్యాధునిక ఆయుధ సంపత్తి
  • ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని అమిత్ షా ప్రకటన

కవ్వింపు చర్యలకు దిగొద్దని భారత్ సంయమనం పాటిస్తున్నా పాకిస్థాన్ బుద్ధి మారడం లేదు.. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్ర వాదుల శిబిరాలను భారత్ కూలిస్తే మళ్లీ దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నించి భంగపడింది పాకిస్థాన్. అయితే ఆ ప్రయత్నాన్ని భారత్ సకాలంలో నిర్వీర్యం చేసేసింది. మన దేశంలోని 15 నగరాల్లో ఉన్న మిలటరీ స్థావరాలపై క్షిపణి దాడికి దాయాది దేశం యత్నించింది. వాటిని ప్రయోగించిన వెంటనే భారత్ సకాలంలో తిప్పి కొట్టింది. బుధవారం అర్ధరాత్రి దాటాక, గురువారం తెల్లవారు జామున పాకిస్థాన్ ఈ దుస్సాహసానికి పూనుకుంది. జమ్ము, కశ్మీర్, పంజాబ్, గుజరాత్ లు టార్గెట్ గా క్షిపణులను ప్రయోగించింది. అయితే వాటిని ముందుగానే పసిగట్టిన భారత ఆర్మీ అవి మన దేశంలోకి దూసుకు రాకుండానే గాల్లోనే నిర్వీర్యం చేసింది. శ్రీనగర్,పఠాన్ కోట్,అమృత్ సర్, లూథియానా, చండీగఢ్ లలో ఉన్న మిలటరీ కేంద్రాలపై దాడులకు పాక్ ప్రయత్నించింది. అయితే లాహోర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నపాకిస్థానీ ఎయిర్ డిఫెన్స్ రాడార్స్,వ్యవస్థలపై దాడులు జరపడమే కాక పాక్ ప్రయోగాలను భారత రక్షణ దళాలు నిర్వీర్యం చేసేశాయి. భారత్ ప్రతిచర్యలపై ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం స్పష్టమైన ప్రకటన చేసింది.

తిప్పి కొట్టిన భారత్…

పాకిస్థాన్ మనదేశంలో15 కీలక నగరాలను టార్గెట్ చేసిన విషయాన్ని మన రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్,నిఘా విభాగాలు గుర్తించి అంతే వేగంతో,అదే తీరులో తిప్పి కొట్టినట్లు తెలిపింది. గాల్లోకి దూసుకొస్తున్నక్షిపణులను వెంటనే కూలిపోయేలా చేసినట్లు ప్రకటించింది.పాకిస్థాన్ ద్రోణ్‌ లను, క్షిపణులను ప్రయోగించగా భారత్ ఆ రెండు వ్యవస్థలనీ నిర్వర్యం చేసిపారేసింది.దీనికోసం భారత్ రష్యన్ తయారీ ఎస్‌ 400 డిఫెన్స్ సిస్టమ్ ను వినియోగించింది.

మన భూభాగం పరిధిలో కుప్పకూలిన పాక్ క్షిపణుల శకలాలను సాక్ష్యాలుగా భారత్ కలెక్ట్ చేసింది.పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందనడానికి స్పష్టమైన ఆధారాలను మనదేశం ఇప్పటికే సంపాదించింది.పాక్ ఆర్మీ ఉగ్రవాద స్థావరాలకు నిధులు ఇవ్వడం, ఉగ్రవాద యువతకు మిలటరీ ట్రైనింగ్ ఇవ్వడం లాంటి కీలక సాక్ష్యాలు భారత్ సేకరించింది.

పెహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా ప్రతీకార చర్య తప్పదని ఇప్పటికే ప్రకటించిన భారత్ ధర్మ పోరాటం చేస్తోంది.పాకిస్తాన్ సరిహద్దుల్లోని, నడిబొడ్డున ఉన్న 9 కీలక ఉగ్రవాద స్థావరాలను మంగళవారం అర్ధ రాత్రి కచ్చితత్వంతో కూడిన దాడులతో మట్టు పెట్టింది.

మన భూభాగంలోకి చొరబడి 26 మంది అమాయకులను బలి తీసుకున్న ఉగ్రవాదులు భారతీయ స్త్రీలను పోయి మీ మోడీతో చెప్పుకోండని నిర్లక్ష్యంగా బదులిచ్చిన తీరుపై యావద్దేశం ఆగ్రహంతో రగిలిపోతోంది. దాడికి ప్రతిదాడి తప్పదని ప్రకటించిన భారత్ వారం రోజులు పాటు దీనిపై ఉన్నతస్థాయి చర్చలు, కీలక భేటీలు, యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని రంగంలోకి దిగింది.ప్రధాని మోడీ టైమింగ్, టార్గెట్, వ్యూహం, దాడి చేసే పద్దతి అన్ని విషయాల్లో స్వేచ్ఛనివ్వడంతో ఆర్మీ నిర్ణయం తీసుకుంది. బుధవారం తెల్లవారుజామున 1.04 నిమిషాలకు ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. దీనికోసం అత్యాధునిక, అధునాతన ఆయుధాలు వాడింది. హామర్ స్మార్ట్ బాంబులు, స్కాల్ప్ క్షిపణులు వాడి ఉగ్రస్థావరాలను పిన్ పాయింటెడ్ రేంజ్ లో గుర్తించి మరీ నేలమట్టం చేసేసింది. ఈ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు మరణించారు.

ఈ ప్రతిదాడితో పాకిస్థాన్ కు భారత్ డైరక్ట్ వార్నింగ్ ఇచ్చింది. పాక్ చేసిన దాడులకు ఇవి ప్రతిదాడులు మాత్రమేనని ఇక్కడితో ఆపకపోతే మరింత ముందుకు వెడతామని తేల్చి చెప్పింది. పెహల్గాం దాడి తర్వాత భారత్ ఏం మాట్లాడకుండానే పాకిస్థాన్ అధీన రేఖదగ్గర కవ్వింపు కాల్పులకు పాల్పడిన వైనాన్ని, మనల్ని రెచ్చగొట్టిన తీరును దేశమంతా గమనించింది. కుప్వారా, బారాముల్లా, యురి, పూంచ్, మెంధర్, రాజౌరీ సెక్టర్లలో పాక్ కాల్పులకు తెగబడి అమాయకుల ప్రాణాలు తీస్తోంది. ఇప్పటి వరకూ 16 మంది అమాయక పౌరులు పాక్ దాడుల్లో చనిపోయారని, చనిపోయిన వారిలో మహిళలు పిల్లలు కూడా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది.ఉద్రిక్తతలు పెంచకుండా పాకిస్థాన్ సహేతుకుంగా నడుచుకుంటే భారత్ ఏమీ అనదని, కానీ రెచ్చగొట్టి హాని తలపెట్టాలని చూస్తే చావుదెబ్బ తప్పదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ తెలిపారు.

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని హోం మంత్రి అమిత్ షా ప్రకటించడంతో పాక్ కు పూర్తి స్థాయిలోనే బుద్ధి చెప్పాలని, అవసరమైతే యుద్ధానికైనా తలపడాలని కేంద్రం నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com