ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించిన భారత సైస్యం అర్థరాత్రి చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌పై దేశమంతటా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆపరేషన్ సిందూర్‌కు యావత్ భారతావని అండగా నిలుస్తోంది. ప్రముఖులు అందరూ జయహో భారత్ అంటూ దేశ ఔన్నత్యాన్ని కొనియాడుతున్నారు. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందించారు.
ఆపరేషన్ సింధూర్‌పై లోకసభలోని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. మన భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నా అన్నారు రాహుల్. జై హింద్ అంటూ రాహుల్‌గాంధీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఆపరేషన్ సింధూర్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు గర్వపడేలా చేస్తున్నాయన్నారు. సాయుధ దళాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం.. జై హింద్ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ పై ఎక్స్ వేధికగా చేసిన పోస్ట్ కు చంద్రబాబు స్పందిస్తూ.. ‘జైహింద్’ అంటూ రిప్లై ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ సైతం ‘జైహింద్… న్యాయం జరిగింది’ అంటూ ట్విట్ చేశారు. భారత సైన్యం చర్యలను అభినందించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. ‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు.
మరోవైపు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తనదైన శైలిలో స్పందించారు. ధైర్యం లేని చోట ధర్మం కోల్పోతారని, స్వార్థం రాజ్యమేలుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.‘‘దశాబ్దాల సహనం… సహనం. చాలా సేపు నిశ్శబ్దాన్ని భరించిన తర్వాత ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం మొత్తాన్ని మళ్ళీ శౌర్య స్ఫూర్తితో నింపిన త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి, వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి. హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఎల్లప్పుడూ మీతోనే ఉంటాం. జై హింద్’’. అంటూ పవన్ కల్యాణ్ హిందీలో ట్వీట్ చేశారు.