పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత, పాక్ సరిహద్దుల్లోని పలు ఎయిర్ పోర్టులు మూసి వేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్ పోర్టులను తక్షణమే మూసివేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా, స్పైస్సెట్, ఇండిగో వంటి విమాన యాన కంపెనీలు ప్రయాణీకులకు అలర్ట్స్ పంపించాయి. సోషల్ మీడియాలో పలు ఎయిర్పోర్టులకు వెళ్లే సర్వీసులు రద్దయినట్లు సమాచారం షేర్ చేశాయి.
ప్రధానంగా బికనీర్, శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల సహా పలు నగరాలకు విమానాలు రద్దయ్యాయి. ఈ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణీకులు తమ ప్రయాణాలు అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలని సూచించాయి. అయితే భారత ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేదాకా పై ఎయిర్ పోర్టులు మూసి ఉండనున్నాయి. అంతేకాదు.. ఎయిరిండియా విమానాలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు దేశ వ్యాప్తంగా రద్దు చేసినట్లు ప్రకటించింది.