25.5 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం

  • ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలని సూచనలు
  • సరిహద్దు రాష్ట్రాలు, కీలక ప్రాంతాల్లో మొదలైన మాక్ డ్రిల్స్
  • ఏ క్షణమైనా యుద్ధానికి దిగే ఛాన్స్
  • కీలక స్థావరాల పరిరక్షణ, తక్కువ నష్టం పై ప్రణాళికలు
  • సరిహద్దు జిల్లాల ప్రజలను బంకర్లు శుభ్రం చేసుకోవాలని పిలుపు
  • ఆహార ధాన్యాలు, సరుకులు నిల్వ చేసుకోవాలని సూచన
  • రేపు దేశవ్యాప్తంగా ఒకేసారి మాక్ డ్రిల్
  • దాడులు జరిగితే ఏం చేయాలన్న దానిపై ప్రాక్టికల్స్
  • కీలక స్థావరాల భద్రతపై దృష్టి పెట్టిన కేంద్రం

దేశ వ్యాప్తంగా యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి. యుద్ధం వస్తే ఎలా కాపాడుకోవాలన్న దానిపై ప్రజలను చైతన్య పరిచే ఉద్దేశంతో కేంద్రం వివిధ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. యుద్ధ సైరన్ ఎలా మోగుతుంది? దాన్నెలా అర్ధం చేసుకోవాలి. వాయుదాడులనుంచి ఎలా తప్పించుకోవాలన్న అంశంపై విస్తృతంగా ఈ డ్రిల్స్ లో అవగాహన పెంచుతున్నారు.ఇప్పటికే త్రివిధ దళాలకు టైమింగ్, టార్గెట్, యాక్షన్ అంతా మీ ఇష్టం అంటూ స్వేచ్ఛ ఇవ్వడంతో ఆర్మీదళాలు సరిహద్దుల దగ్గర పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. మిలటరీ దాడులు లేదా ఉగ్రదాడులు జరిగితే ఎలా రక్షించుకోవాలన్న అంశంపై రేపు 300 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో మాక్ డ్రిల్ టేకప్ చేస్తారు. దేశ రాజధాని అయిన ఢిల్లీ, అణు శక్తి స్థావరాలు, మిలటరీ బేస్ లు, రిఫైనరీలు, జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్న సున్నితమైన కీలక ప్రాంతాల్లో ఈ డ్రిల్ నిర్వహిస్తారు.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు,ప్రజలు, విద్యార్ధులు, పోలీసులు, పారా మిలటరీ విభాగాలు ఈ డ్రిల్ లో పాల్గొంటాయి. 1971 పాకిస్థాన్ యుద్ధం తర్వాత ఇంత పెద్ద ఎత్తున సన్నాహాలు చేయడం ఇదే తొలిసారి.

సివిల్ డిఫెన్స్ ఏరియా అంటేః ఆర్ధిక కేంద్రాలు,మిలటరీ బలగాలున్నప్రాంతం,మౌలిక వనరులున్న ప్రదేశం అంటే ఆయిల్ రిఫైనరీ లేదా న్యూక్లియర్ ప్లాంట్ ఉన్న ఒక నిర్దేశిత భౌగోళిక ప్రాంతాన్ని సివిల్ డిఫెన్స్ ఏరియా అంటారు.

పెహల్గాం దాడి తర్వాత భారత పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న తరుణంలో సివిల్ డిఫెన్స్ ఏరియాల్లో ముందు జాగ్రత్తలు, యుద్ధ సన్నాహాలు చేసుకునేలా, పరిస్థితులకనుగుణంగా సైనిక దళాల అప్రమత్తతను పరీక్షించేందుకే ఈ మాక్ డ్రిల్స్ చేస్తున్నారు. త్రివిధ దళాల సన్నాహాలను పరీక్షించడమే కాక వాయుదాడులను పసిగడుతూ వేసే సైరన్లు, ఎయిర్ ఫోర్సులో హాట్ లైన్ సర్వీసులు ఎలా ఉన్నాయన్న దానిపైనా ఒక ట్రయల్ లా గా దీనిని నిర్వహిస్తున్నారు.ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాట్లను కూడా ఈసందర్భంగా చెక్ చేస్తారు. దీనికి తోడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పౌరులకు ఆత్మ రక్షణ విధానాలపై అవగాహన పెంచుతారు.ఫైర్‌ ఫైటింగ్ మెకానిజం పై కూడా శిక్షణ ఇస్తారు.

పవర్ ప్లాంట్లు, ఫ్యాక్టరీలు, ప్రజా మౌలిక వనరుల కేంద్రాలపై దేశంలో అన్ని చోట్లా ఒకేసారి మాక్ దాడులు జరిపి వారి అప్రమత్తతను గమనిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ, ముంబై, బెంగళూరు,కొల్ కాతా, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాలపై ఒకే సారి ఈ మాక్ దాడులు జరుపుతారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో స్థానికులు, పోలీసులు, అధికారులు మాక్ డ్రిల్స్ చేస్తున్నారు. ఎన్డీఆర్‌ ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి.యుద్ధం వస్తే యూపీలో 19 కీలక ప్రదేశాలను హై రిస్క్ ఏరియాలుగా గుర్తించారు. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్ లాంటి రద్దీ ఏరియాల్లో ఉండే జనం తక్షణం సురక్షిత స్థావరాలకు ఎలా వెళ్లాలన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. రాజస్థాన్, పంజాబ్ లాంటి పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

లీక్ చేస్తే కఠిన చర్యలు…

డబ్బులకు ఆశపడి ఎవరైనా భద్రతకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తే వారిపై కఠిన చర్యలుంటాయి. పాకిస్థాన్ వైపునుంచి ఎవరైనా బెదిరించినా, భయపెట్టినా, బ్లాక్ మెయిల్ చేస్తూ కీలక సమాచారం అడిగినా ఆవిషయాన్ని ముందుగా అధికారులకు తెలియచేయాలి. సర్వీసులో ఉన్న ప్రతీ ఒక్కరి కదలికపైనా నిఘా ఉంది అని జై సల్మేర్ పోలీస్ సూపరింటెండెంట్ ప్రకటించారు.

పూరీలో ప్రత్యేక భద్రత…

ఈనెల 27న జగన్నాథ రథయాత్ర జరగనున్న పూరీలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 12 కీలక ప్రాంతాలను ఆ రాష్ట్రంలో గుర్తించారు.కర్ణాటకలో మూడు జిల్లాలు, గుజరాత్ లో 15, మహారాష్ట్రలో 16 కీలక స్థావరాలను గుర్తించారు. ఇదేకాక బీజేపి ప్రజలందరినీ ఈ మాక్ డ్రిల్ లో పాల్గొనాలని అదే మరిన్ని పకడ్బందీ చర్యలకు అవకాశమిస్తుందని ఎక్స్ ద్వారా కోరింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com