ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘ది వండర్‌మెంట్ టూర్’ లైవ్ కాన్సర్ట్ ఘనంగా జరిగింది. సంగీతం, భావోద్వేగం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకను 40,000 మందికిపైగా ప్రేక్షకులు ప్రత్యక్షంగా ఆస్వాదించారు.
‘వేవ్స్ సమ్మిట్ 2025’లో భాగంగా నిర్వహించిన ఈ కాన్సర్ట్ ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా సాగింది. ఈ కార్యక్రమం తొలుత జోష్ నింపే సంగీతంతో మొదలైంది. ది యెలో డైరీ, అనుభా బజాజ్, రిడాయ్ లైవ్ పెర్ఫామెన్స్‌తో ప్రారంభమై, తరువాత సుఖ్విందర్ సింగ్, జోనితా గాంధీ, ఏఆర్ అమిన్, జనై భోసలే, ఆఖరికి ఏఆర్ రెహమాన్ స్వయంగా స్టేజ్‌ను షేక్ చేశారు. “జై హో”, “ఐరే తూఫాన్”, “జింగుఛా”, “వందే మాతరం” వంటి పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
అర్ధరాత్రి సమయంలో గాయకుడు మోహిత్ చౌహాన్, యాక్టర్ ధనుష్ కూడా జోడయ్యారు. వీరిద్దరూ ఏఆర్ రెహమాన్‌తో కలిసి లైవ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌పై ప్రాజెక్ట్ డైరెక్టర్ అశ్విన్ ముకుందన్ మాట్లాడుతూ, “ఇది ఒక కచేరి మాత్రమే కాదు.. సృజనాత్మకత, సంగీత శక్తిని ప్రదర్శించే వేడుక. 40,000 మందికి పైగా ప్రేక్షకులు ఆనందంతో ఊగిపోయిన దృశ్యాన్ని చూడటం, మాకు ఎంతో సంతృప్తిని కలిగించింది” అని తెలిపారు.
శియామక్ డావర్ రూపొందించిన అద్భుత నృత్య రూపకాలు, సంగీత మాధుర్యం కల గలిపిన ఈ వండర్‌మెంట్ టూర్.. ముంబైకి మరపురాని అనుభవాన్ని అందించింది.