32.9 C
Hyderabad
Friday, October 30, 2026

Live Video

spot_img

కులగణన కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అవుతుందా?

  • కేంద్రంపై రాహుల్ కులగణన అస్త్రం..
  • ఫలించిన కాంగ్రెస్ ఎత్తుగడ..
  • వ్యూహాత్మకంగా ఓకే చెప్పిన బీజేపి పెద్దలు
  • జనగణనతో పాటు కులగణన చేసేందుకు సన్నాహాలు
  • పెహల్గాం దాడి వేడి చల్లారక ముందే బీజేపి రాజకీయం
  • జోడో యాత్రతో దేశవ్యాప్తంగా రాహుల్ ప్రచారం
  • గత ఎన్నికల్లో బీజేపి జోరుకు బ్రేకులేసిన రాహుల్
  • ఈసారి బీజేపి డిఫెన్స్ గేమ్ తో దూకుడు
  • ముంచుకొస్తున్న బీహార్, యూపీ, తమిళనాడు ఎన్నికలు
  • మళ్లీ కదలనున్న రిజర్వేషన్ల తుట్ట
  • కులగణనతో ఉత్తర, దక్షిణ భారతం మధ్య అంతరాలు?
  • రాహుల్ పై ఇది బూమరాంగ్ అవుతుందా?

దేశ వ్యాప్తంగా కులగణన వేడి రాజుకుంది.జనాభా లెక్కలతో పాటు కలిపి కులగణన చేయాలన్న విపక్షాల డిమాండ్ కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ దీనిని అజెండాగా చేసుకుని రాజకీయం  చేస్తోంది. రాహుల్ గాంధీ కుల గణన డిమాండ్ ను భుజాన మోస్తూ దేశమంతా తిరుగుతున్నారు. ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోలేకపోయినా కులగణన చేయక తప్పని పరిస్థితిని బీజేపికి కల్పించడంలో ఆయన కృతకృత్యు లయ్యారు.అయితే కులగణన చేస్తామని బీజేపి ప్రకటిస్తుందని ఆయన ఊహించలేక పోయారు. బీజేపి వ్యూహాత్మకంగా చేసిన హటాత్ ప్రకటన నుంచి తేరుకోడానికి కాంగ్రెస్ కు కాస్త సమయం పట్టింది. ఇది తమ ఘనతేనని చెప్పుకోడానికి తగినంత టైమ్ లేదు. చివరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక వీడియో చేసి వదిలింది. రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తారు. రేవంత్ రెడ్డి అమలు చేస్తారు.. నరేంద్ర మోడీ  అనుకరిస్తారు అంటూ ఓ వీడియోను రేవంత్ ప్రభుత్వం ప్రచారంలోకి వదిలింది.అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్నా రాహుల్ గాంధీ ముందుచూపు ప్రభుత్వ విధానంగా మారిందంటూ కాంగ్రెస్ చెప్పుకుంటోంది.

క్రెడిట్ రాహుల్ దే!!

రాహుల్, కాంగ్రెస్ పార్టీ నిరంతరాయంగా పెంచిన వత్తిడి వల్లనే బీజేపి ఈరోజు కులగణన కాలమ్ ను జనగణన సర్వే రిజిస్టర్లో పెట్టక తప్పలేదు. 2011 నాటి సర్వేలో ఎన్యూమరేటర్లు ఇంటింటి జనగణనలో కేవలం ఎస్సీ, ఎస్టీ ల వివరాలు మాత్రమే సేకరించారు.ఇతర కులాల వివరాలు తెలియలేదు.

రెండేళ్ల నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరున దేశమంతా కలియ తిరిగినప్పుడు ఈ డిమాండ్ కి గుర్తింపు వచ్చింది. రాహుల్ మైలేజ్ బాగా పెరిగింది. దీన్ని బీజేపి గమనిస్తూ వస్తోంది. 2024 ఎన్నికల్లో దీని ప్రభావం కొంత మేర కనిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా బీజేపిని వెనక్కు నెట్టడంలో విజయం సాధించిందనే చెప్పాలి.మరో వైపు బీజేపిలోనే గడ్కరీ లాంటి నేతలు కులగణన అవసరమన్నరీతిలో చేసిన కామెంట్లు కూడా బీజేపిని ఇరుకున పెట్టాయి.

కుల గణన సెగ..

రాహుల్… భారత్ జోడో యాత్ర పేరుతో కావలసినంత సెగ రాజేశారు. అట్టడుగు వర్గాలను నిర్ణయాధికారంలో భాగస్వాములను చేయాలంటూ రాహుల్ పెంచిన ఒత్తిడి 2024 ఎన్నికల్లో బీజేపి సునాయాస గెలుపుకు బ్రేకులేసింది. జనాభాను బట్టి అధికారాలు అన్న డిమాండ్‌ ఊపందుకోవడం దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాలు, జాతుల వారు కూడా దీనిపై ఒత్తిడి పెంచడంతో బీజేపి ఉక్కిరి బిక్కిరయ్యింది. 272మెజారిటీకి 30 సీట్లు దూరంలో బీజేపి నిలబడిపోవాల్సిన పరిస్థితి. అదే టైము లో కాంగ్రెస్ బలం 47 సీట్లనుంచి 99 సీట్లకు పెరిగింది. ఇది ఒక ఎత్తయితే.. దేశానికి గుండె కాయి లాంటి యూపీలో బీజేపి దారుణంగా దెబ్బతింది. అక్కడ 64 సీట్ల నుంచి 36 సీట్లకు పడిపోయింది. ప్రతిపక్షాల బలం 16నుంచి 43కి పెరిగింది.

కులగణన డిమాండ్‌ ను భుజానికెత్తుకున్న రాహుల్ తనకొక ఐడెంటిటీని, పరపతిని పెంచుకోవడంలో సక్సెస్ అయ్యారు.జోడో యాత్ర పేరిట వాడ వాడలా తిరుగుతూ.. యువతతో సమావేశమవుతూ కుల గణన ఆవశ్యకతను చాటారు. అంతేకాదు బీహార్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నితీష్, తేజస్వి యాదవ్ ల సహకారంతో  జరిపిన సర్వేను ఒక ఉదాహరణగా చూపారు.కర్ణాటకలో దశాబ్దం క్రితం చేసిన కుల గణన అనుమానాల బూజు దులిపింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన పెద్ద సంచలనంగా మారింది. అగ్రకులాలనుంచి ఎన్ని వత్తిడులు వచ్చినా కాంగ్రెస్‌ మాత్రం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తామంటూ సిద్ధపడింది.

బీజేపి నిర్ణయం వెనుక ఏముంది?

పెహల్గాం లో ఉగ్రదాడి నేపధ్యంలో దేశమంతా ఆగ్రహంతో రగిలిపోతున్న వేళ,పాక్ పై ప్రతీకార చర్యలకు దిగాలని, లేదా యుద్ధం చేయాలని దేశమంతా డిమాండ్ చేస్తున్న వేళ నరేంద్రమోడీ కుల గణనకు సై అంటూ రంగంలోకి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.పెహల్గాం తర్వాత వణుకుతున్న పాకిస్థాన్ భారత్ ప్రతీకార చర్యల భయంతో బిక్క చచ్చిపోయింది.ఈ టైమ్ లో మోడీ చేసిన ఈ ప్రకటన పాక్ దృష్టిని మళ్లించడానికి చేస్తున్న డైవర్షన్ జిమ్మిక్ అనీ మరికొందరు అంచనా వేస్తున్నారు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడే కులగణన చేసేందుకు సిద్ధపడ్డారని తెలుస్తోంది.

2024 ఎన్నికల తర్వాత ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నప్పుడే అన్ని రాష్ట్రాల బీజేపి నేతలకు సమాచారం ఇచ్చింది. సంచలనాత్మక కులగణనకు శ్రీకారం చుట్టబోతున్నామన్న సంకేతాలను ఇచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మరో కొత్త నినాదం తలకెత్తుకోవాల్సిన అవసరం ఉందని బీజేపి గ్రహించింది.

కాంగ్రెస్ కదిలించిన రిజర్వేషన్ల తుట్టను నెత్తికెత్తుకుంటే తలెత్తే పరిణామాలను కూడా బీజేపి ఊహించింది. ఉత్తర, దక్షిణ భారతాల మధ్య ఇది అతిపెద్ద వివాదంగా మారనుంది. ఉత్తరాదిన రాజకీయ అధికారమే మారిపోయే పరిస్థితి ఉంది.ఓబీసీలు గణనీయంగా ఉన్న బీజేపి… కాంగ్రెస్ మార్క్ సోషల్‌ ఇంజనీరింగ్ ను తలకెత్తుకోవాలనుకుంటే కచ్చితంగా రిజర్వేషన్ల తుట్టను కదపాల్సిందే.

బీజేపీ అందుకే తలొగ్గిందా?

ఇక్కడ గమనించాల్సిన అంశమేమంటే కాంగ్రెస్ కులగణన డిమాండ్ తో అడుగలేసినా హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ పార్టీకి ఒరిగింది శూన్యం. మరోవైపు 2026లో బీహార్ కు 2027లో యూపీకి అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గణనీయంగా ఉన్న అట్టడుగు వర్గాల ఓట్లను కొల్లగొట్టాలంటే కులగణన అంశాన్నినెత్తికెత్తుకోవాల్సిందే.వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే తమిళనాడులో సైతం కులం అంశం ఓటరు మైండ్ పై చాలా కీలకమైన ప్రభావం చూపిస్తుంది.

కాంగ్రెస్ కి ఆ సత్తా ఉందా?

కాంగ్రెస్ కష్టపడి లేవనెత్తిన కులగణన ఎన్నికల అస్త్రాన్ని బీజేపి లాగేసుకుంది.ఈ క్రెడిట్ వార్ లో కాంగ్రెస్ వెనకపడకుండా చూసుకోవాల్సిన అవసరముంది.మా స్క్రిప్టే కాపీ కొట్టారంటూ రొటీన్ డైలాగులు చెబితే సరిపోదు.కానీ కులగణన ద్వారా అధికారంలో ఉన్న తెలంగాణ,కర్ణాటకలలో బలహీన వర్గాలను నిర్ణయాధికారంలో భాగస్వాములను చేసి చూపించాల్సిన అవసరముంది. అప్పుడే జనం నమ్ముతారు.అయితే ఈ ప్రయత్నాన్ని అగ్రవర్ణాలు కచ్చితంగా అడ్డుకుంటారు.కర్ణాటకలో ఇప్పుడు జరుగుతున్నది అదే.

 బూమరాంగ్‌ అవుతుందా?

బీజేపి ఈ సమయంలోనే ఈ వివాదాస్పద అంశాన్ని నెత్తికెత్తుకోడం వెనుక కూడా ఒక వ్యూహముంది. దేశంలో ఓబీసీల లెక్క తేలాలంటూ 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం మండల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. దేశంలో 52 శాతం ఓబీసీలున్నారని ఈ నివేదిక తేల్చింది. దీనిప్రకారం 27 శాతం ఉద్యోగాలు ఓబీసీలకు ఇవ్వాలని ఈ కమిషన్ సిఫారసు చేసింది. ఇది అమలు చేస్తే ఓబీసీల రిజర్వేషన్లు 49 శాతానికి చేరతాయి. అయితే నివేదిక సమర్పించే నాటికి మొరార్జీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన ఇందిరాగాంధీగానీ, రాజీవ్ గాంధీ గానీ దీనిని అమలు చేయలేదు. 1990లో వీపిసింగ్ ప్రభుత్వం అధికారం చేపట్టాక దీనిని అమలు చేయడానికి ప్రయత్నించింది. అయితే అప్పట్లో దీనిపై పెద్ద దుమారం రేగింది. కారణమేమంటే దేశంలో 55 శాతం ఓబీసీలుంటే కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్లో ఉన్న 5శాతం ఉద్యోగాలకు మాత్రమే రిజర్వేషన్ వర్తింప చేసినట్లు లెక్క. దీనిపై కాంగ్రెస్, బీజేపి సహా అన్ని పక్షాలు ఆందోళనలను చేశాయి. ఎంతో మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంతో సుప్రీం కోర్టు నివేదిక అమలును ఆపేసింది. 1992లో ఈ సిఫారసులు అమలు చేయడం మొదలుపెట్టారు.అయితే ఒకరకంగా చెప్పాలంటే ఈ నివేదిక అమలుకన్నా ముందే ఓబీసీ కోటా పేరిట అత్యధిక స్థాయిలో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. కాబట్టి మండల్ కమిషన్ హంగామాకు అర్ధం లేకుండా పోయింది. అప్పట్లో దీన్ని రాజకీయ అస్త్రంగా వాడిన వీ.పి. సింగ్ ఆ తర్వాత రాజకీయంగా దెబ్బ తినేశారు. ఇప్పుడు రాహుల్ ఏరికోరి ఆ అస్త్రాన్ని తలకెత్తుకోవడం అంటే మళ్లీ బీజేపి చేతికి అస్త్రం ఇచ్చినట్లేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కులగణన పేరుతో ఈబీసీలు, ఓబీసీల లెక్క ఎస్సీ, ఎస్టీల ఇతర వెనుకబడిన వర్గాల జనాభాకన్నా ఎక్కువున్నారా?  తక్కువున్నారా అన్నది తేలాల్సి ఉంది. అదేగనక తేలితే దేశ రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది. పార్టీల వ్యూహాలు మారతాయి. రాహుల్ కదిల్చిన ఈ తేనెతుట్ట ఆయనకు అధికారం తెచ్చిపెడుతుందా లేక వీపీసింగ్ లా దెబ్బతింటారా? ఇంత వివాదాస్పదమైన అంశాన్ని తలకెత్తుకోడం అంటే దీనికో శాశ్వత పరిష్కారం చూపడమే బీజేపి ధ్యేయంగా కనిపిస్తోంది. కచ్చితమైన గెలుపు సూత్రం లేనిదే ఆ పార్టీ రంగంలోకి దిగదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com