ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన భేటీ అయిన జాతీయ భద్రతా వ్యవహారాల కేబినెట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్‌వ్యవస్థీకరించింది. కొత్తగా ఏడుగురు సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు చైర్మన్‌గా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. మాజీ ఆర్మీ, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఈ బోర్డు సభ్యులుగా ఉండనున్నారు.
వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ మాజీ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మోంటీ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఆర్మీలో పనిచేసిన వారు. ఇక మాజీ ఐపీఎస్‌లు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్‌లు కూడా ఈ బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఇక రిటైర్డ్ అయిన మాజీ IFS అధికారి వెంకటేశ్ వర్మ కూడా బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. మొత్తం ఏడుగురితో కొత్త బోర్డు ఏర్పాటైంది.
వీరంతా కూడా భారత భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. కేంద్రం పాలసీలు ఎలా ఉండాలి.. భవిష్యత్తును ముందే ఊహించి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై కేంద్రానికి సలహాలు ఇవ్వనున్నారు. అయితే కశ్మీర్ ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక ఆంతర్యమేంటన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఈ బోర్డును 2018లో కేంద్రం ఏర్పాటు చేసింది. రష్యాలో భారత అంబాసిడర్‌గా పనిచేసిన పీఎస్ రాఘవన్ దీనికి చైర్మన్‌గా ఉండేవారు.