చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్‌జగన్ సమావేశం అయ్యారు. సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు కూడా హాజరైన ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని చెప్పారు. పాలనలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా విధ్వంసమే కనిపిస్తోందన్నారు. అన్ని శాఖల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని… ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ళాలని జిల్లా పార్టీ అధ్యక్షులకు వైఎస్.జగన్ సూచించారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై స్పందించాల్సి వచ్చినప్పుడు ఎవరి ఆదేశాల కోసమో మీరు చూడద్దని, మీకు మీరుగా నిర్ణయం తీసుకుని ప్రజల పక్షాన పోరాడాలని వైసీపీ నేతలకు జగన్ చెప్పారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను కలపుకుని మీరు ప్రజల తరపున చేసే పోరాటాలు రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తాయన్నారు. జూన్, జూలై నెలల్లో వార్డు, డివిజన్ స్ధాయి కమిటీలు పూర్తి చేయాలని, అలాగే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు మాసాల్లో బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా అధ్యక్షులకు వైఎస్.జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ వ్యవస్ధీకృతం కావాలని ఇందులో జిల్లా అధ్యక్షుల పాత్రే కీలకమన్నారు. బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు మీకున్న ముఖ్యమైన విధుల్లో ఒకటన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్ధవంతంగా పార్టీని ఎవరు లీడ్ చేయగలరని అంశాన్ని పరిగణనలోకి తీసుకుని మీకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించామని, మీమీ జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషి చేయాలని వైఎస్.జగన్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు బయటపడతాయని, ఈ సమయంలో మనం చేసే పనుల వల్లే మనం ఎలివేట్ అవుతామని వైఎస్.జగన్మోహనరెడ్డి అన్నారు.
- Advertisement with us -