పహెల్‌గామ్ ఉగ్రదాడికి సంబంధించిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూనే ఉన్నాయి. ఈ మారణహోమంలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించి వివరాలు సేకరిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. ఈ దాడిలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు పాల్గొనగా.. అందులో ముగ్గురు పాకిస్థాన్ వారు కాగా.. మరొకరు స్ధానిక ఉగ్రవాది అని తేల్చారు. అతని పేరు ఆదిల్ థోకర్ అని కూడా గుర్తించాయి దర్యాప్తు సంస్థలు.
అంతేకాదు ఈ మారణహోమం కోసం ఉగ్రవాదులు 22 గంటల పాటు అడవుల్లో ట్రెక్కింగ్ చేసినట్టు కూడా గుర్తించాయి. కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలినడకనే వచ్చారు ఉగ్రవాదులు. ఈ దాడుల సమయంలో ఉగ్రవాదులు రెండు ఫోన్లను చోరీ చేశాడు. ఒక స్థానికుడు ఫోన్‌తో పాటు.. మరో టూరిస్టును ఫోన్‌ను ఎత్తుకెళ్లారు.
ఇక ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న అదిల్ థోకర్‌కు సంబంధించిన విషయాలను కూడా తవ్వి తీస్తున్నారు. 2018లో హిజ్బుల్ ముజాహిదిన్‌లో చేరిన ఆదిల్.. అధికారికంగా పాకిస్థాన్‌కు వెళ్లాడు. పాక్ నుంచి స్టూడెంట్ వీసా సంపాదించిన ఆదిల్.. అక్కడికి వెళ్లిన తర్వాత నేరుగా ఉగ్రసంస్థలో చేరి ట్రైనింగ్ తీసుకున్నాడు. లష్కరే తొయిబా అతడిని ట్రైన్ చేసింది. అతను మళ్లీ 2024లో కశ్మీర్‌కు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఉగ్రవాదులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ.. వారికి కావాల్సిన ఏర్పాట్లను చూసుకున్నాడు.
ఈ దాడుల్లో ఉగ్రవాదులు ఏకే-47 తుపాకులతో పాటు.. M4 అసాల్ట్ రైఫిల్స్‌ను ఉపయోగించారు. దాడి సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు అడువుల వైపు నుంచి రాగా.. మరో ఇద్దరు స్థానిక షాప్‌ల నుంచి బయటికి వచ్చారు. ఓ వైపు నుంచి వచ్చిన ఉగ్రవాదులను చూసి టూరిస్టులు పరిగెత్తగా.. మరోవైపు నుంచి మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ టూరిస్టు తన కెమెరాతో రికార్డు చేశాడు. ప్రాణ భయంతో చెట్టుపైకి చేరిన అతడు.. అక్కడి నుంచి ఈ దుర్మార్గాన్ని మొత్తం షూట్ చేశాడు. ఈ కేసులో అతని ప్రధాన సాక్షి అనే చెప్పాలి. NIA ఇప్పటికే అతడిని విచారించింది. అతడు తీసిన వీడియోలు ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానున్నాయి.
ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఈ విచారణను టేకప్ చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇప్పటికే దాడి జరిగిన మరుసటి రోజు నుంచి NIA టీమ్ కశ్మీర్‌లో తిష్ట వేసి దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే ప్రత్యక్ష సాక్షులను విచారించింది. అసలు టెర్రరిస్టులు ఎలా వచ్చారు? ఎలా వెళ్లారు? అనే దానిపై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.