30.2 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

ఉగ్రదాడిపై ప్రతీకారం : భారత్ ముందు నాలుగు మిలిటరీ ఆప్షన్‌లు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో యావత్‌ భారతం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈ ముష్కర దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో దేశమంతా ఆవేదనతో రగిలిపోతోంది. ఉగ్రవాదుల దౌర్జన్యానికి సరైన బుద్ధి చెప్పాలనే సంకల్పంతో భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడిని భారత్ ఇప్పటికే పెంచింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్‌ను ఆర్థికంగా బలహీనపరిచే ప్రయత్నం మొదలుపెట్టింది. పహల్గాంలో నరమేథం సృష్టించిన ఉగ్రవాదులకు కఠినమైన బదులు ఇవ్వాలని భారత్ దృఢంగా నిర్ణయించుకుంది.

ప్రస్తుతం సైనిక చర్యలపై భారత ప్రభుత్వం గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ, నిపుణుల అంచనాల ప్రకారం భారత్ ముందు నాలుగు ప్రధాన మిలిటరీ ఆప్షన్‌లు ఉన్నట్లు విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం:

1. రఫేల్, మిరాజ్ ఫైటర్ జెట్లతో కీలక స్థావరాలపై దాడులు :

భారత వాయుసేన వద్ద అత్యాధునిక ఫైటర్ జెట్లు రఫేల్, మిరాజ్ ఉన్నాయి. వీటి సహాయంతో పాకిస్తాన్‌లోని కీలక ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్‌లు నిర్వహించడం మొదటి ఆప్షన్‌గా చెబుతున్నారు.

బాలాకోట్ దాడి తరహాలో కాకుండా మరింత ప్రణాళికా బద్ధంగా దాడులు జరిపే అవసరం ఉంది. శత్రు రక్షణ వ్యవస్థలను ఛేదించే సామర్థ్యం రఫేల్, మిరాజ్ లకు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడిని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి.

2. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఆపరేషన్లు :

ఇటీవల పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెట్టినట్టు చేసిన ప్రకటనల నేపథ్యంలో, నియంత్రణ రేఖను పాక్ పట్టించుకోవడం లేదన్న క్లారిటీ వచ్చేసింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, భారత్ ఎల్‌వోసీ దాటి ఉగ్రస్థావరాలపై దాడులు చేపట్టే అవకాశముంది. అయితే నియంత్రణ రేఖ వెంబడి కఠినమైన భౌగోళిక పరిస్థితులు, పాక్ ఆర్మీ బలమైన పొజిషన్లు ఈ కార్యాచరణకు సవాలుగా మారవచ్చు. దీని వల్ల ఆపరేషన్లకు ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా ఉంది.

3. భారీ టార్గెట్లపై సర్జికల్ స్ట్రైక్స్ :

భారీ టార్గెట్లను గుర్తించి, అత్యంత సున్నితమైన సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం మరో ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. 2016లో ఉరి దాడులకు ప్రతిగా భారత్ విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన అనుభవం ఉంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ అప్రమత్తంగా ఉండటంతో సర్జికల్ స్ట్రైక్స్ సాఫీగా జరగడం కష్టం కావొచ్చు. దీనికోసం నిజమైన సమయానికి ఇంటెలిజెన్స్ సమాచారం, శక్తిమంతమైన దళాలు, ఖచ్చితమైన ప్రణాళిక అవసరం.

4. శతఘ్నులు, స్నైపర్లతో కాల్పులు :

చివరిగా, నియంత్రణ రేఖ వెంబడి శత్రు స్థావరాలపై భారీ శతఘ్నులు, మోర్టార్లు, స్నైపర్ గన్స్ ఉపయోగించి గురి తప్పకుండా దాడులు చేయడం మరో ఆప్షన్‌గా ఉంది. ఈ విధమైన చర్యలతో శత్రు సరఫరా మార్గాలను, ఔట్‌పోస్టులను కూడా ధ్వంసం చేయవచ్చు. ఉద్రిక్తత స్థాయిని తక్కువ చేయడం కూడా వీటి ప్రత్యేకత. అయితే, ఈ విధమైన చర్యలతో మాత్రమే గణనీయమైన ప్రతీకారం సాధ్యపడదు. పెద్ద స్థాయి దాడులు చేస్తేనే గట్టిగా సందేశం పంపగలుగుతామన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఏ ఆప్షన్‌ను ఎంచుకుంటుందో ఇప్పుడే తెలియకున్నా.. ఏదైనా చర్య చేపట్టే ముందు అంతర్రాష్ట్ర రాజకీయాలు, అంతర్జాతీయ మద్దతు, భవిష్యత్తులో వచ్చే ప్ర‌భావాలను సమగ్రంగా పరిశీలించే అవకాశం ఉంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com