పదేళ్ల పాలనలో ప్రజల హక్కులను అన్ని రకాలుగా హరించిన బీఆర్ ఎస్ కు తమ నాయకులను విమర్శించే అర్హత లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ విమర్శించారు. హెచ్ఐసీసీ నొవాటెల్ లో జరుగుతున్న అంతర్జాతీయ రాజకీయ సదస్సు భారత్ సమ్మిట్ 2025లో న్యాయ పథ్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక చిత్ర ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి లాంఛనంగా శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇతర దేశాలతో భారత్ కున్న సత్సంబంధాలు, చారిత్రక ఘటనలను నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతోనే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ ప్రగతిశీల ఉద్యమానికి మార్గ నిర్దేశం చేసేలా ఈ సదస్సును నిర్వహించామన్నారు. ప్రగతిశీల ఆలోచనలు, ప్రజాస్వామ్యం, ప్రపంచ శాంతి తదితర అంశాల్లో పనిచేసే 100 దేశాలకు చెందిన మేధావులను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేశామన్నారు. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మార్గ నిర్దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఏఐ సాయంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని శ్రీధర్ బాబు విమర్శించారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఫోటోలను రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో విడుదల చేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి హితవు పలికారు.