పహెల్గామ్ ఉగ్రదాడితో భారత పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రెండు దేశాలు పోటాపోటీగా ఆంక్షలు విధించుకుంటున్నాయి. సింధు ఒప్పందాన్ని బుట్టదాఖలు చేస్తున్నట్టు భారత్ ప్రకటించగానే… సిమ్లా ఒప్పందాన్ని కాలరాస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ కు చెందిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చుట్టపు చూపుగా వచ్చిన వారి అవస్థ వర్ణణాతీతం. జోధ్‌పూర్‌కు చెందిన సనాఖాన్ పాకిస్థాని వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులను చూసేందుకు భారతకు వచ్చిన ఆమె… ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ తిరిగి వెళ్లేందుకు యత్నించగా అటారీ సరిహద్దుల్లో పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అక్కడే బైఠాయించిన మహిళ తనకు అనుమతి ఇచ్చేవరకు కదిలేది లేదని..లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని రెండు రోజులుగా సరిహద్దుల్లో పడిగాపులు పడుతోంది. తనకు ఇద్దరు పిల్లలని వారు లాహోర్ లో ఉన్నారని, పిల్లలకు పాకిస్థాన్ పౌరసత్వం ఉందని, పెళ్లి జరిగి 20 ఏళ్లు గడిచినా తనకు పాకిస్థాన్ పౌరసత్వం ఇవ్వలేదని మహిళ వాపోయింది.
మరొకరి కేసులో కరాచీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ వచ్చిన మహిళ తాజా పరిస్థితులను చూసి కన్నీటిపర్యంతం అవుతోంది. పాక్ నుంచి వచ్చిన రెండు రోజులకే ఆంక్షలు విధించటంతో వారి కుటుంబసభ్యులు హతాశులయ్యారు. పదేళ్లకు ఒకసారి పాకిస్థాన్ నుంచి భారత వస్తున్న సొదరి రెండు రోజులకే వెళ్తుండటంతో… వీడ్కోలు చెప్పేందుకు కుటుంబమంతా వాఘా సరిహద్దులకు చేరుకుంది. పాక్ ప్రభుత్వం మహిళకు అనుమతి ఇవ్వలేదు. ఈ మహిళకు కూడా పాకిస్తాన్ పౌరసత్వం లేదు.
రాజస్థాన్ బార్మేర్‌కు చెందిన మహిళకు కొత్తగా పెళ్లైంది. పాక్ ప్రభుత్వం అనుమతించకపోవడంతో అటారీలోనే చిక్కుకుపోయింది ఈ మహిళ. వాఘా వైపు భర్త మహిళ కోసం వేచిచూస్తున్నాడు.
ఇదిఇలా ఉంటే సింద్ రాష్ట్రం నుంచి వచ్చిన వారి వ్యధ అంతా ఇంత కాదు. సింధ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మత చాందసవాదుల దాడులను భరించలేక భారత్ వచ్చిన వంద హిందు కుటుంబాలు రాజస్థాన్‌లోని జైసల్మీర్ ప్రాంతంలో శరణార్థి శిబిరాల్లో ఉంటున్నాయి. వీరికి భారత పౌరసత్వం ఇప్పటి వరకు రాలేదు. తాజా వ్యవహారంతో వీరిని పాకిస్థాన్ తిరిగి వెళ్లమని స్థానిక పోలీసులు ఆదేశించారు.
దీంతో అవాక్కయిన శరణార్థులు.. చచ్చినా సరే భారతదేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదని ప్రకటించారు. పాకిస్థాన్ తిరిగి వెళ్లటం అంటూ జరిగితే తమ శవాలే వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక వైద్యం కోసం భారత్ వచ్చిన కుటుంబాలు చికిత్స పూర్తి అయ్యే వరకు అనుమతించాలని వేడుకుంటున్నారు. తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక కాన్సులేట్ వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలా ఒక్కొకరి కథ ఒకలా ఉంది.
రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతుంటే సామాన్యులు సమిధలవుతున్నారని పౌర సంఘాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. ఉగ్రదాడికి ప్రతీకారం తీసుకోదల్చుకుంటే రెండు ప్రాంతాల్లోని పౌరులకు ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టాలని పౌర సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.