ఏప్రిల్ 22వ తేదీన పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి ప్రతీ భారతీయుడి మనస్సును కలచివేసింది. అంతేకాదు.. ప్రపంచ దేశాలను కూడా ఉలిక్కిపాటుకు గురిచేసింది. దేశ, విదేశాల నుంచి ఈ ముష్కర మూకల దాడిని ఖండిస్తూ సందేశాలు వెల్లువెత్తాయి. అగ్రరాజ్యం అమెరికా మొదలుకొని.. చాలా దేశాలు భారత్‌కు అండగా ఉంటామని ప్రకటించాయి. ఉగ్రవాదాన్ని తరిమి కొడదామని కూడా పిలుపునిచ్చాయి. ఇక, ఇటు మన దేశంలో.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడికి దేశమంత కన్నీటిపర్యంతమవుతోంది.
కానీ, ఢిల్లీలో ఓ ఆఫీసులో ఈ పరిణామాన్ని సెలబ్రేట్ చేసుకున్నారన్న ఆనవాళ్లు బయటకొచ్చాయి. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమీషన్ అధికారులు ఈ ఉగ్రదాడి తర్వాత సంబురాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు.
ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేకును తీసుకువెళ్లాడు. ఈ దృశ్యాలు మీడియా కంట పడ్డాయి. అది గమనించిన మీడియా ప్రతినిధులు కేకు ఎందుకు తీసుకెళ్తున్నారని ఆ వ్యక్తిని ప్రశ్నించారు. అయితే, ఊహించని ఈ పరిణామంతో షాక్ అయిన ఆ వ్యక్తి.. మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా.. తప్పించుకొని వడివడిగా లోపలికి వెళ్లాడట. దీంతో, ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ అధికారులు పహల్గాం ఉగ్రదాడిని సెలబ్రేట్ చేసుకున్నట్లే అర్థమవుతోందంటున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ హై కమీషన్ ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు.