మంగళవారం మధ్యాహ్నం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పెహల్‌గామ్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన తర్వాత పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా భారత ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా రెస్పాండ్ అయ్యింది. ఇంకా అవుతూనే ఉంది. తాజాగా పాకిస్తాన్ ఎక్స్ ఖాతాను ఇండియాలో బ్యాన్ చేసింది. భారత్‌లో పాకిస్తాన్ అధికారిక ఎక్స్ అకౌంట్ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకుంది.
ఈ ముష్కరుల దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై చర్యలకు దిగింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థానీ జాతీయులకు భారత్‌లో ప్రవేశంపై నిషేధం విధించడం వంటి ఐదు అంశాలతో కూడిన చర్యలను భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌లో పాకిస్థాన్ ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను యాక్సెస్ చేయకుండా నిలిపివేసింది.
1960లో పాక్‌తో కుదుర్చుకున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలుపుదల చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సీమాంతర ఉగ్రవాదానికి అందిస్తోన్న మద్దతును పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ నుంచి స్పష్టమైన, విశ్వసనీయమైన ప్రకటన వెలువడే వరకు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టును వెంటనే మూసివేస్తున్నట్లు తెలిపింది. చట్టబద్ధమైన పత్రాలతో భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థానీ పౌరులు మే 1వ తేదీలోగా తిరిగి వెళ్లిపోవచ్చని భారత్ ప్రకటించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థానీ జాతీయులు భారత్‌లో ప్రయాణించడానికి అనుమతించబోమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద గతంలో పాకిస్థానీ జాతీయులకు జారీ చేసిన వీసాలు రద్దయినట్లేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద వీసా తీసుకుని ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్థానీ జాతీయులు 48 గంటల్లోగా భారత్‌ను వీడాలని ప్రభుత్వం ఆదేశించింది.ఇస్లామాబాద్‌లోని భారతీయ హై కమిషన్ నుంచి తన రక్షణ, నౌకాదళ, వైమానిక సలహాదారులను ఉపసంహరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అదే విధంగా ఢిల్లీలోని పాకిస్థానీ హై కమిషన్‌లో ఉన్న ఆ దేశ సైనిక, నౌకాదళ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లోగా భారత్‌ను వీడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.