జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ప్రభావం తిరుమలపై కూడా కనిపిస్తోంది. పుణ్యక్షేత్రం తిరుమలలో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు.. భద్రతను భారీగా పెంచారు.
తిరుమల కొండపై భద్రతను మరింత పెంచారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో స్వామివారి ఆలయం పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోంది. ఇక, కొండ దిగువన అలిపిరి చెక్ పోస్ట్, శ్రీవారి మెట్టు మార్గాల్లో కూడా వాహనాలు, భక్తుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డులో వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానం ఉన్న వాహనాలను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుండి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను తనిఖీ చేస్తున్నారు.భక్తుల లగేజీని ఆలిపిరి సప్తగిరి చెక్ పోస్ట్‌లో, అలాగే నడకమార్గాల్లోనూ స్కాన్ చేసి మాత్రమే అనుమతిస్తున్నారు.
భద్రతా చర్యలలో భాగంగా ఆలయ పరిసరాల్లో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా స్పందించాలి? భక్తులను ఎలా రక్షించాలి? వంటి అంశాలపై ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. గతేడాది మార్చిలో కూడా తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు.
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆక్టోపస్ దళం ఇలా ఎప్పటికప్పుడు డ్రిల్స్ చేస్తూ ఉంటుంది. ఈ డ్రిల్‌లో విజిలెన్స్ సిబ్బంది, సివిల్, రిజర్వు పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది కూడా భాగస్వాములయ్యారు.
విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. 24 గంటల పాటు సాయుధ బలగాల పహారా కొనసాగుతోంది. ఆలయ ప్రాంగణంలో ప్రతి మూలలోనూ నిఘా పెట్టారు.
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతాపరంగా తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రక్షణ తమ మొదటి బాధ్యత అని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.