కర్నాటక మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాష్ హత్యకు గురయ్యారు. బెంగుళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లోని తన నివాసంలో ఈ కర్నాటక రిటైర్డ్ టాప్ కాప్ ఓం ప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండి కనిపించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓం ప్రకాష్ భార్య పల్లవే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మాజీ డీజీపీ ఓం ప్రకాష్ మృతి చెందిన విషయాన్ని ఆయన భార్య పల్లవే పోలీసులకు సమాచారం అందించారు. బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లాకు చెందిన ఓంప్రకాష్ దశాబ్ధాలుగా కర్నాటకలో ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఓంప్రకాష్ 1981వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2015వ సంవత్సరంలో ఆయన కర్నాటక డీజీ అండ్ ఐజీపీగా పనిచేశారు. రవాణా కమీషనర్, అగ్నిమాపక సేవల డైరెక్టర్, క్రైమ్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ ఏడీజీపీగా అనేక కీలక బాధ్యతలను ఆయన కర్నాటక రాష్ట్రంలో నిర్వర్తించారు. మాజీ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ హత్యకు గురై రక్తపు మడుగులో పడి ఉండటం కర్నాటక పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదిలా ఉండగా ఓం ప్రకాష్ ని ఆయన భార్య పల్లవే హత్య చేసిందనే నిర్ధారణకు కర్నాటక పోలీసులు వచ్చారు. పల్లవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త ఓం ప్రకాష్ ని దారుణంగా పొడిచి చంపిన భార్య పల్లవి అనంతరం మరో ఐపీఎస్ అధికారి భార్యకు వీడియో కాల్ చేసి రాక్షసుడిని చంపేశానని రక్తపు మడుగులో పడి ఉన్న ఓంప్రకాష్ మృతదేహాన్ని చూపించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. తనను భర్త ఓంప్రకాష్ హత్య చేయడానికి ప్రయత్నించడాని అందుకే తాను ఆయన్ను చంపినట్లు పల్లవి పోలీసుల వద్ద అంగీకరించినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.