-
కసిరెడ్డి తెలివైన క్రిమినల్ అంటోన్న విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ హయాంలో జరిగిన లిక్కర్ వ్యవహారంపై కూటమి సర్కారు విచారణలో వేగం పెంచుతోంది. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేసుకున్న ప్రభుత్వ పెద్దలు.. ఆ దిశగా వేగం పెంచారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే లిక్కర్ దందాలో జరిగిన అవకతవకలపై సిట్ వేయడంతో.. సిట్ విచారణ ముమ్మరం చేసింది. అందులో భాగంగానే మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఇప్పటికి రెండు సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి కూడా విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీచేసింది. అయితే, తనకు జారీ అయిన నోటీసులపై మిథున్‌రెడ్డి వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా న్యాయవాదిని అనుమతించాలని, వీడియో రికార్డ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. అలాగే, ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించింది. మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పాటు.. విచారణకు సహకరించాలని ఆయనకు సూచించింది. దీంతో, ఎంపీ మిథున్‌రెడ్డి ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణకు వెంట తన న్యాయవాదిని కూడా మిథున్ రెడ్డి తీసుకెళ్లారు.
మరోవైపు.. ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కర్త, కర్మ, క్రియ కసిరెడ్డే అంటూ కొద్దిరోజుల క్రితం మీడియా ముందే బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో తనకు తెలిసిన వివరాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సాయిరెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనే విజయ సాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
సిట్ విచారణకు హాజరైన తర్వాత విజయ సాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలివైన క్రిమినల్ అని విజయసాయిరెడ్డి తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలివైన క్రిమినల్ అని.. ఆయన తనను మోసం చేశారన్నారు. తాను కసిరెడ్డికి అరబిందో నుంచి వంద కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పించానని విజయ సాయిరెడ్డి చెప్పారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మూడు కంపెనీలు పెట్టి లిక్కర్ తయారు చేశారన్న విషయం తనకు తెలియదని, వాటిలో రెండు కంపెనీలకు మాత్రం వంద కోట్ల రూపాయలు ఇప్పించానని చెప్పారు. 12 శాతం వడ్డీ చెల్లించేలా ఆ అప్పు మొత్తం ఇప్పించానని విజయ సాయిరెడ్డి చెప్పారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తనకు తమ పార్టీ నేతలే పరిచయం చేశారని, కసిరెడ్డిని ప్రోత్సహించి తాను తప్పు చేశానన్నారు. ఇక, లిక్కర్ పాలసీ వ్యవహారానికి సంబంధించి తన ఇంట్లో రెండు మీటింగ్‌లు జరిగాయని.. విజయసాయిరెడ్డి సిట్ అధికారుల ముందు అంగీకరించారని చెబుతున్నారు. ఆ సమావేశాల్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారని చెప్పారట. అయితే, లిక్కర్ అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాల్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని చెప్పారు. దుర్మార్గమైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేతిలో తాను మోసపోయానని బాధపడుతున్నానన్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వసూలు చేసిన డబ్బులు ఎవరికి వెళ్లాయో తనకు తెలియదన్నారు. కసిరెడ్డి మాత్రమే ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, లిక్కర్ స్కామ్‌లో బిగ్ బాస్ ఉన్నాడో, లేడో అనేది తనకు తెలియదని విజయ సాయిరెడ్డి చెప్పారు. విచారణలో సిట్ అధికారులు తనను లంచాలకు సంబంధించిన ప్రశ్నలు వేశారని, ఆ వ్యవహారం తనకు తెలియదని బదులిచ్చానన్నారు. అయితే, రెండు కంపెనీలకు మాత్రం సిఫారసు చేశానని చెప్పానని.. ఒకరికి 60 కోట్ల రూపాయలు, మరొకరికి 40 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పానని వెల్లడించారు. అయితే, తాను అప్పు మాత్రమే ఇప్పించానని.. నిధులను ఖర్చు చేయడం గురించిన వివరాలు తనకు తెలియదని చెప్పానన్నారు. సిట్ అధికారులు విచారణ సందర్భంగా తనను అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పానన్నారు. మరోసారి సిట్ అధికారులు విచారణకు పిలిచినా వస్తానని విజయసాయి చెప్పారు. ఈ క్రమంలోనే జగన్ కోటరీపై మరోసారి ఆయన విరుచుకుపడ్డారు. తాను నెంబర్ టు స్థానంలో ఉండేవాడినని.. తర్వాత రెండు వేల స్థానానికి పడిపోయానన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనది రెండో స్థానమని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ స్థానం మిథ్య అని తేలిందన్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో అన్నీ తనే చూసుకున్నానని.. అయితే, తాను వెన్నుపోటు దారుడినని కొందరు జగన్‌కు చెప్పారన్నారు. ఆ కోటరీ వల్లే తాను పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని విజయసాయిరెడ్డి తెలిపారు. అంతేకాదు.. తాను వేల కోట్ల రూపాయలు దోచుకున్నానని కొందరు జగన్‌కు చెప్పారని ఆయన మండిపడ్డారు.
సిట్ కూడా ఈ వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే సూత్రధారి అని, ఆయన కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం నడిచిందని ఓ నిర్ణారణకు వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే విచారణకు రావాల్సిందిగా కసిరెడ్డికి సిట్ మూడు సార్లు నోటీసులు జారీ చేసింది. కానీ, మూడు సార్లు కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు. అంతేకాకుండా కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో, ఆయన కుటుంబసభ్యులకు సిట్ నోటీసులు జారీచేసింది. అలాగే కసిరెడ్డి తండ్రికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తండ్రిని రెండు రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు.
గడిచిన ఐదేళ్ల కాలంలో మద్యం ద్వారానే కసిరెడ్డి అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని సిట్ ఇప్పటికే గుర్తించిందని అంటున్నారు. ఆ డబ్బుతోనే అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, ఓ సినిమా కూడా తీశారని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారట. దీంతో, ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు సిట్ రెడీ అవుతోందంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే లిక్కర్ స్కాంలో ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరనేది బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.