సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అరెస్ట్ చేసిన మహిళపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సీఐ భాస్కర్ ఓ మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారని అంబటి మండిపడ్డారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు విషయంలో అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పాలేటి కృష్ణవేణిని శనివారం ములాఖాత్ ద్వారా అంబటి రాంబాబు పరామర్శించారు. కృష్ణవేణిని కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాయంత్రం ఐదు గంటలకు పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ ఆమెను మరుసటి రోజు ఉదయం వరకూ పోలీస్ స్టేషన్లోనే ఉంచి కనీసం ఆహారం కూడా పెట్టలేదని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపెచ్చు కృష్ణవేణితో సీఐ భాస్కర్ అసభ్యంగా మాట్లాడారని విమర్శించారు. తాము చెప్పినట్లు వినకపోతే తన భర్తపై గంజాయి అక్రమ రవాణా కేసు పెడతామని బెదిరించినట్లు కృష్ణవేణి చెపుతోందన్నారు. కృష్ణవేణి బంధువులు ఎవరూ పోలీస్ స్టేషన్లోకి అడుగుపెట్టడానికి వీలు లేకుండా స్టేషన్ గేట్లకు బేడీలు వేయడం పట్ల అంబటి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహిళల జోలికి వస్తే ఊరుకోనని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏంచేస్తారో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.
- Advertisement with us -