పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి? ఆందోళనలు ఎందుకు కంట్రోల్ కావడం లేదు? ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఎందుకు ఉక్కుపాదంతో వీటిని అణచివేయడం లేదు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఓ వార్నింగ్ ఇష్యూ చేశాయి. బెంగాల్‌లోని పలు జిల్లాల్లో చాప కింద నీరులా ఉగ్రవాదం పెరుగుతోందని చెబుతోంది. బంగ్లాదేశ్‌లోని కొన్ని ఉగ్రవాద సంస్థలు వక్ఫ్ చట్టాన్ని అడ్డుగా పెట్టుకొని ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నట్టు గుర్తించాయి నిఘా వర్గాలు.
జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ అనే సంస్థ ఇప్పుడు ఉగ్రవాదాన్ని పెంచే పనిలో ఉందని తెలుస్తోంది. మదర్సాల నుంచి యువకులను రిక్రూట్ చేసుకొని సరిహద్దుల్లోని ఏడు జిల్లాల్లో అల్లర్లు సృష్టించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ముర్షిదాబాద్, 24 పరగణాల జిల్లాల్లో అలర్లు మొదలయ్యాయి. దీని వెనక కూడా ఈ JMB సంస్థ హస్తం ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి.
ఇప్పటికే బెంగాల్‌లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయనే సమాచారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అల్లర్లను కంట్రోల్ చేయడంలో విఫలం కావడంతో కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పరిస్థితి అదుపులోకి వచ్చింది. మమతా బెనర్జీ కావాలనే ఈ విషయాలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. అంతేకాదు అలర్లు జరుగుతున్న ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలుగా ప్రకటించి.. కేంద్ర బలగాలకు పూర్తి అధికారులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అప్పుడే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని చెబుతోంది.