- కాంగ్రెస్ పార్టీలో భారీగా సంస్ధాగత మార్పులు.
- ఇక మీదట జిల్లా అధ్యక్షులే కీలకం
- పిసిసి అధ్యక్షులకు చెక్ పెడుతున్న అధిష్టానం.
- అభ్యర్థుల ఎంపికలో జిల్లా అధ్యక్షుల ఫీడ్ బ్యాకే కీలకం
- రెండు నెలల్లో కీలక మార్పులు… వెల్లడించిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే
గత మూడు పర్యాయాలుగా వరుస ఎదురు దెబ్బల తరువాత ఇప్పుడు పార్టీలో అనేక సంస్ధాగత మార్పులు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గడచిన రెండు రోజులుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు ఆ పార్టీ అధిష్టానం తీసుకుంది. పాత సాంప్రదాయాన్ని సరికొత్తగా మళ్ళీ పాటించాలనే అభిప్రాయానికి కాంగ్రెస్ వచ్చినట్లు ఆహ్మదాబాద్ సమావేశాల్లో వక్తల ప్రసంగాలను బట్టి అర్ధమవుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అయితే ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికే చోటు ఉంటుందని, పని చేయలేకపోతే రిటైర్ అయి విశ్రాంతి తీసుకోవాలని ఆయన కొంచెం కటువుగానే విషయాన్ని తేల్చి చెప్పారు. అలాగే ఇకపై జిల్లా అధ్యక్షులకు ఫుల్ పవర్స్ ఉంటాయని వారి సూచనలు, సలహాల మేరకే ఏ ఎన్నికలకైనా అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని ఖర్గే బాంబు పేల్చారు. ఇదే గనుక జరిగితే కొన్ని దశాబ్ధాలుగా అప్రతిహతంగా కొనసాగుతున్న పీసీసీ అధ్యక్షుల ప్రభ ఇక నుంచి మసకబారినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీలో సంస్ధాగతంగా భారీ మార్పులు చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి ఈ మార్పులు తీసుకురావడం వల్ల పార్టీ బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. గతంలో అమలు చేసిన విధానాలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో అతి ముఖ్యమైనది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను బలోపేతం చేయడం. నిజానికి నలభై ఏళ్ళ క్రితం ఇలాంటి విధానమే కాంగ్రెస్ పార్టీలో ఉండేది. పార్టీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి అభిప్రాయానికి అత్యంత ప్రాధాన్యత ఉండేది. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల ఎంపికలో కూడా వాళ్ళ పాత్ర కీలకంగా ఉండేది.
అయితే రాను రాను పార్టీలో ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. పీసీసీ అధ్యక్షులే రాష్ట్ర పార్టీకి కీలకమయ్యారు. పిసీసీ అధ్యక్షుడు సిఫారసు చేసిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. ఇలా చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని రాహుల్ గాంధీకి చాలా రోజుల నుంచి ఫిర్యాదులు అందాయి. పీసీసీలకు క్షేత్ర స్ధాయి నుంచి ఖచ్చితమైన సమాచారం అన్ని సందర్భాల్లో రాకపోవడంతో అర్హులైన నాయకులకు అన్యాయం జరుగుతోందనే వాదన పార్టీలో ఎప్పటి నుంచో ఉంది. అలా కాకుండా జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటే అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ మొదటి నుంచి తన అభిప్రాయన్ని పార్టీ వేదికలపై స్పష్టంగా చెపుతున్నారు.
అహ్మదాబాదులో జరిగిన రెండు రోజుల కాంగ్రెస్ సమావేశంలో కూడా ఈ అంశంపై ప్రధాన చర్చ జరిగింది. జిల్లా అధ్యక్షులను మరింత బలోపేతం చేస్తామని స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. 1970లో ఈ విధానం అమల్లో ఉండేదని అయితే వివిధ కారణాల చేత ప్రస్తుతం ఇది అమలు జరగడం లేదని సీనియర్ నాయకులు అంటున్నారు. కేవలం పిసిసి అధ్యక్షులకు ప్రాధాన్యత ఇస్తే కిందిస్థాయిలో జరిగే పరిస్థితులపై అవగాహన ఉండదు కనుక కచ్చితంగా కిందిస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే జిల్లా అధ్యక్షులు మరింత బలంగా ఉండాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ విషయానికొస్తే జిల్లా అధ్యక్షులు ఎంపిక ఇంకా జరగలేదు.. పిసిసి రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు కూడా ఆలస్యం అవుతోంది.
తాజా ఏఐసీసీ నిర్ణయం వల్ల జిల్లా అధ్యక్షుల ఎంపికను నేరుగా అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది. అనేక దశాబ్దాల తర్వాత జిల్లా అధ్యక్షుల సమావేశం ఢిల్లీలో జరిగింది. స్వయంగా మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీలు ఈ భేటీకి హాజరై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జిల్లా అధ్యక్షుల ఫీడ్బ్యాక్ ఇక నుంచి అత్యంత కీలకం కానుందని అధిష్టానం డైరెక్షన్స్ ఇచ్చేసింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ కొత్త విధానం మరో మూడు నెలల్లో అమల్లోకి రానుంది. ఇక నుంచిఏ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా పిసిసి అధ్యక్షుడు కచ్చితంగా జిల్లా అధ్యక్షులు అభిప్రాయాలను తెలుసుకొని వాటిని అమలు చేయాలని అలా పిసిసి అధ్యక్షులు చేయకపోతే నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేయవచ్చని రాహుల్ గాంధీ అంటున్నారు.
పనిచేయని నేతలకు చెక్ పెట్టాలని ఉద్దేశంతోనే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షులు పవర్ఫుల్ కాగా రానున్న కాలంలో మాత్రం వీళ్ళ అధికారాలకు కోత విధించడం తోపాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.