31.6 C
Hyderabad
Saturday, October 31, 2026

Live Video

spot_img

ప్రపంచ దేశాలు అడుక్కుంటున్నాయ్‌.. – ట్రంప్‌ వ్యాఖ్యలతో దుమారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముందుగా చెప్పినట్లుగానే.. చైనా దిగుమతులపై ఏకంగా 50 శాతం అదనపు సుంకాలను విధించారు. ఇప్పటికే ఉన్న 20శాతం, 34శాతం సుంకాలకు తోడుగా తాజా పెంపుతో కలిపి, చైనా దిగుమతులపై మొత్తం 104శాతం టారిఫ్‌లు అమలవుతున్నాయి.

“డీల్ చేయడంలో నేను మేటి. ఇప్పుడే కాదు, ముందే చెప్పా!” అని గర్వంగా వ్యాఖ్యానించారు ట్రంప్‌. ప్రపంచ దేశాలు తనతో చర్చలు జరపాలని తెగ ప్రయత్నిస్తున్నాయని, కొందరు దేశాల నాయకులు “ప్లీజ్ సార్… ఒక డీల్ చేద్దాం” అంటూ వేడుకుంటున్నారని, కాళ్ల బేరానికి వస్తున్నారని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ అనుచిత వ్యాఖ్య చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తాజాగా జరిగిన నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ట్రంప్, అమెరికా ప్రజలు తన దృఢమైన నిర్ణయాలను గమనించి తనకు ఓటు వేశారని అన్నారు. అమెరికా తయారీ రంగంలో అగ్రస్థానంలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్, టారిఫ్‌లతో హడలెత్తిస్తున్నారు. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడమే తన టార్గెట్ అంటున్నారు.

అయితే, దీనివల్ల పలు దేశాల నేతలు గందరగోళంలో పడిపోయారని చెబుతున్నారు. చర్చలు జరపక తప్పదన్న నిర్ణయానికి వస్తున్నారని అంటున్నారు. ట్రంప్ చర్యలపై అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు ఆందోళన వ్యక్తం చేస్తూ వైట్‌హౌస్‌కు కాల్స్ చేస్తున్నారట. ఈ విధంగా స్టాక్ మార్కెట్ల పనితీరు బలహీనపడితే, దీని రాజకీయ ప్రభావాలు అధికంగా ఉంటాయని ట్రంప్ సన్నిహితులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఫార్మా రంగం కూడా ట్రంప్ కళ్లల్లో పడింది. త్వరలో ఈ రంగంపై టారిఫ్‌లు విధించనున్నట్టు ఆయన ప్రకటించటంతో, భారతీయ ఫార్మా కంపెనీల షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. చైనా, ఇండియా వంటి దేశాల నుంచి వస్తున్న ఔషధ ఉత్పత్తులు అమెరికాలో తయారు చేయించాలన్నదే తన లక్ష్యమని అందుకే ఫార్మాపైనా టారిఫ్‌లు పెంచబోతున్నట్లు ట్రంప్‌ చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియా, భారత్‌, తైవాన్ వంటి దేశాలు డీల్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో, న్యూజిలాండ్ వడ్డీ రేట్లు తగ్గించగా, దక్షిణ కొరియా ఆటో రంగానికి 16వేల కోట్ల ఎమర్జెన్సీ ప్యాకేజీ ప్రకటించింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com