32.2 C
Hyderabad
Sunday, April 26, 2026

Live Video

spot_img

విశాఖ స్టీల్‌ మూసివేతవైపు అడుగులు?

  • సన్నాయి నొక్కులు నొక్కుతోన్న ప్రభుత్వం?

  • కొనసాగుతోన్న ఉద్యోగుల తొలగింపు

  • సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధం

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – ఆర్‌ఐఎన్‌ఎల్‌ పరిధిలో ఉన్న వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపులో యాజమాన్యం వెనక్కి తగ్గడంలేదు. ఇప్పటికే రెండు దశల్లో 2,603 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించగా, మరో 440 మందిని రెన్యువల్ చేయకుండా విధుల్లోకి తీసుకోకుండా బయట ఉంచారు. ఇదే సమయంలో 1,223 మంది పర్మినెంట్ ఉద్యోగులు వీఆర్ఎస్ -వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ తీసుకున్నారు.

ప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, అధికార టీడీపీ నేతలు దీనిని ఖండిస్తుండటం గమనార్హం. అయినప్పటికీ, సంస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం ప్రైవేటీకరణ దిశగా సాగుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. పెద్దఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుతో పాటు, పర్మినెంట్ ఉద్యోగులను వీఆర్ఎస్‌ ద్వారా బయటకు పంపిస్తున్నారు.

స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం లక్ష్యం ప్రకారం, ప్రతి మూడు నెలలకు 1,400 మందిని, ఏడాదిలో మొత్తం 5,600 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 1,100 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. తాజాగా మరో 1,503 మందిని విధుల నుంచి తొలగించారు. రెన్యువల్ లేకుండా బహిష్కరించబడిన 440 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ రీజినల్ లేబర్ కమిషనర్ వద్ద చర్చలు కొనసాగుతున్నాయి.

ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ప్రతిరోజూ వందల మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. మొదటగా మెడికల్ ఫిట్‌నెస్ లేని వారిని, 55 ఏళ్లకు పైబడినవారిని టార్గెట్ చేశారు. ఇప్పటికే సంబంధిత జాబితా కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌లో సుమారు 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 10,000 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో చాలా మందిని తొలగించడం వల్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోందని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పటికే సెయిల్ వంటి సంస్థలతో పోలిస్తే వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఇది మరింత నష్టానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఉద్యోగుల సంఖ్య తగ్గింపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, కాంట్రాక్ట్ కార్మికులు ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించారు. మొత్తం 15,000 మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ వెల్లడించింది. యాజమాన్యం తగిన చర్యలు తీసుకునే వరకు సమ్మె కొనసాగించాలన్నదే వారి తీర్పు.

సమ్మెకు మద్దతుగా ఈ నెల 7న రీజినల్ లేబర్ కమిషనర్‌తో మరోసారి చర్చలు జరిపేందుకు, 6న కూర్మన్నపాలెం వద్ద భారీ రాస్తారోకో నిర్వహించేందుకు, ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశమై వినతిపత్రాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని మార్గాల్లో ప్రయత్నించిన అనంతరం.. తమకు స్పష్టమైన హామీ రాకపోతే సమ్మెలోకి దిగనున్నట్లు కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com