-
కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ
-
స్టీల్ వ్యర్థాలు తొలగింపు మరింత వేగవంతం
నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన స్టీల్ వ్యర్థాలను తొలగించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ పనులను పర్యవేక్షిస్తున్న టన్నెల్ ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి టన్నెల్ లోపల జరిగిన సహాయక చర్యలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టన్నెల్ లోపల అత్యధికంగా పేరుకుపోయిన స్టీల్ పదార్థాలను లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్న ఐదు ఎస్కవేటర్లు స్టీల్ భాగాలను, ప్రమాద ప్రదేశంలో ఉన్న భారీ రాళ్లను లోకో ట్రైన్ ప్లాట్‌ఫామ్ పైకి తరలిస్తున్నట్లు వివరించారు.
అదే విధంగా, ఇప్పటికే 100 మీటర్ల మేర పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు సాయంతో మట్టి, బురదను బయటకు తరలిస్తున్నామని తెలిపారు. టన్నెల్ లోపల ఉన్న ఊట నీటిని నిరంతరం పంపింగ్ చేస్తూ, డి వాటరింగ్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నట్లు వివరించారు.
సహాయక బృందాలకు అవసరమైన వసతులు కల్పిస్తూ, ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ప్రతి రోజూ సమీక్షా సమావేశం నిర్వహిస్తూ చర్యల పురోగతిని సమీక్షిస్తున్నట్లు శివ శంకర్ లోతేటి స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, సింగరేణి రిస్క్యూ జీఎం బైద్య, ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాసులు, జిఎస్‌ఐ అధికారులు రాజ్‌కుమార్, జె పి కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.