29.5 C
Hyderabad
Saturday, August 29, 2026

Live Video

spot_img

టమాటా ధరలు నేలచూపులు – అన్నదాతల దిగాలు

టమాటా ధరలు భారీగా తగ్గిపోయాయి. రైతులకు కనీసం తమ పెట్టుబడులు తిరిగి వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం రైతులు కిలో టమాటాకు కేవలం రూ.2 నుండి రూ.6 మధ్య మాత్రమే పొందుతున్నారు. ఈ పరిస్థితితో చాలా మంది రైతులు తమ టమాటాలను మార్కెట్లకు కూడా తీసుకెళ్లకుండానే పొలాల్లోనే పారబోస్తున్నారు.

మార్కెట్లోకి టమాటాలు తీసుకెళ్ళినప్పటికీ, 25 కిలోల బాక్స్‌కు రూ.50 నుండి రూ.150 మధ్య మాత్రమే పొందుతున్నారు. అయితే, 25 కిలోల బాక్స్‌కు కనీసం రూ.400 ఉంటేనే రైతులకు కొంత లాభం వస్తుంది. చిన్న వ్యాపారులు మార్కెట్లో కిలో టమాటాను రూ.10 నుండి రూ.20 మధ్య ధరలతో అమ్ముతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా, పలమనేరు మార్కెట్‌లో 15 కిలోల బాక్స్‌కు గరిష్ఠంగా కేవలం రూ.90 మాత్రమే లభించింది. కనిష్టంగా చూస్తే.. 15 కిలోల బాక్స్‌కు రూ.30 మాత్రమే గిట్టుబాటయ్యింది. దీంతో, టమాటా రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం శ్రమించి, పెట్టుబడులు పెడితే.. పెట్టుబడులు కూడా రాకపోవడంపై తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

ఈ పరిణామం జాతీయ స్థాయిలో కూడా ఒక సమస్యగా మారింది. చత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని స్థానిక మార్కెట్లకు ఆయా రాష్ట్రాల టమాటాలు సరిపోతున్నాయి. దీంతో, ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఏపీ మార్కెట్లకు టమాటాలు కొనుగోలు చేయడానికి రాలేకపోతున్నారు. దీంతో, ఆంధ్రప్రదేశ్‌లో టమాటా ధరలు మరింతగా తగ్గిపోతున్నాయి. అయితే, ఏప్రిల్ నుండి టమాటా ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు.

అయితే, అటు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు.. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో టమాటా బహిరంగ మార్కెట్‌లో పది నుంచి 20 రూపాయలు మాత్రమే పలుకుతున్నాయి. అటు రైతుల దగ్గర మాత్రం వ్యాపారులు సగటున కిలో రెండు రూపాయలకు కొంటున్నారని చెబుతున్నారు. పండించిన రైతుల కన్నా మధ్యలో వ్యాపారులు ఎక్కువ లాభాలు పొందుతున్నారు. అయినప్పటికీ వినియోగ దారుల దృష్టిలో చూస్తే.. ప్రయోజనకరంగానే ఉన్నా.. రైతులకు కనీసం ఆ మొత్తం కూడా చెందడం లేదన్నది ఆందోళన కలిగించే అంశం.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com