-
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ
-
పక్షం రోజులకే పరస్పర విరుద్ధ వ్యాఖ్యానాలతో అయోమయం
-
ఏది నిజం? అంటూ జనసేన కేడర్‌లో సందిగ్ధం
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట మార్చారు. ఓ బహిరంగ వేదికపై తాము లేకుంటే ఆంధ్ర ప్రదేశ్‌లో అసలు కూటమి ప్రభుత్వమే లేదన్నట్లుగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. మరో బహిరంగ వేదికపై తమకు అస్సలు సత్తా లేదని గ్రహించిన కారణంగానే కూటమికి మద్దతు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఈ రెండు సభలకు మధ్య సమయం కేవలం 15 రోజులు మాత్రమే. పదిహేను రోజుల్లోనే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. అప్పుడేమో పార్టీ వేదికపై మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఇప్పుడేమో అధికారిక వేదికమీద ప్రసంగించారు. ఈ పరిణామాలు జనసేన క్యాడర్‌ను గందర గోళంలో పడేశాయి.
తాను పోటీ చేసి గెలిచిన పిఠాపురం నియోజక వర్గంలోని చిత్రాడలో మార్చి 14వ తేదీన జనసేన వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘జనసేన జయకేతనం’ పేరుతో చేపట్టిన ఆ బహిరంగ సభలో పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు సెటైర్ల మీద సెటైర్లు వేశారు. జనసేనకు అసలు తిరుగే లేదని ఎవరి కోణంలో వారు వ్యాఖ్యానించారు. ఆ బహిరంగ సభా వేదిక పై నుంచే పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ దారుణమైన పరిస్థితుల్లో ఉంటే తామే సపోర్ట్ ఇచ్చి నిలబెట్టామని, అదీ జనసేన పార్టీ సత్తా అని మాట్లాడారు. జనసేన పార్టీ నిలబెట్టడం వల్లే ఇవాళ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తెలుగుదేశం పార్టీకి అధికారం చేరువయ్యిందని అన్నారు. దాంతో.. జనసేన పార్టీ కేడర్‌లో ఎక్కడా లేని ఉత్సాహం తొంగి చూసింది. అసలు తాము లేకుంటే ఏపీలో రాజకీయాలే లేవన్న కోణంలో జనసైనికులు పొంగిపోయారు.
అయితే, ఆ ఉత్సాహం, ఊపు, జోష్ ఎంతోకాలం లేదు. సరిగ్గా పదిహేను రోజుల తర్వాత మార్చి 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో అధికారిక ఉపన్యాసం చేశారు పవన్ కల్యాణ్. ఆ సభా వేదికపై సీఎం చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. అసలు చంద్రబాబు అంటే విజనరీ లీడర్ అని, అందుకే ఆయనతో దశాబ్ద కాలంగా కలిసి ఉంటున్నానని, చంద్రబాబు అంటే ఎన్నికల కోసం ఆలోచించే వ్యక్తి కాదని, ముందు తరాల గురించి ఆలోచించే శక్తి అని ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు లాంటి నాయకుడికి మద్దతు ఇస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశ్యంతో తాను మొదటి నుంచీ చంద్రబాబుకే మద్దతు ఇస్తున్నానని చెప్పారు. అంతటితో ఆగకుండా.. అసలు తమకు సత్తా లేదన్న విషయం తెలుసని, సత్తా లేదు కాబట్టే.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నానన్నారు. మన దగ్గర ప్రజలకు ఉపయోగ పడే సత్తా గానీ, బలం గానీ, సమర్థత, తెలివి తేటలు, ప్రతిభ లేనప్పుడు.. అవన్నీ ఉన్న నాయకుడికి ఓట్లు చీలకుండా మద్దతు ఇస్తే.. అది ప్రజలకు బలం అవుతుందని గ్రహించానని, అందుకే తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నానని పవన్ కల్యాణ్ బాబు దండకం అందుకున్నారు.
ఈ పరిణామంతో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. మొన్నటికి మొన్న తామే బలమని, తాము నిలబెడితేనే తెలుగుదేశం పార్టీ నిలబడిందని జబ్బలు చరుచుకొని చెప్పిన పవన్ కల్యాణ్.. తీరా పక్షం రోజులు గడవక ముందే తమకు అసలు సత్తా లేదని, అందుకే ఆ సత్తా ఉన్న నాయకుడికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించడం చూస్తుంటే జనసేన కేడర్‌లో సందిగ్ధం అలుముకుంది. పవన్ కల్యాణ్ తరచూ మాటలు మారుస్తారని, ఆయన నోటికి ఏది అనిపిస్తే ఆ సమయంలో అదే మాట్లాడతారని సాధారణంగా పేరున్నా.. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. ఒక ముఖ్యమైన రాజకీయ పార్టీకి అధినేతగా ఉండి పవన్ కల్యాణ్ ఇలా బహిరంగ సభల్లో మాటలు మారుస్తూ ఉంటే తాము ఏది నమ్మాలని జనసేన క్యాడర్ ప్రశ్నిస్తున్నారు.
ఇక, దీనిపై అప్పుడే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, వ్యాఖ్యానాలు కూడా మొదలయ్యాయి. జనసేన జయ కేతనం సభలో చేసిన వ్యాఖ్యలతో జనసేన పార్టీ కేడర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌తో విరుచుకు పడ్డారు. ఇప్పుడేమో తెలుగు దేశం పార్టీ కేడర్.. దటీజ్ తెలుగుదేశం, దటీజ్ చంద్రబాబు అంటూ తమ సత్తా ఇదంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అంతటితో ఆగకుకండా.. జనసేన కేడర్.. తగ్గి ఉండాలని, మీ నాయకుడే తమకు సత్తా లేదని ఒప్పుకున్నాడని, మీరు కింది స్థాయిలో కాలర్ ఎగరేయొద్దంటూ తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఆడుకుంటున్నారు.