తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముస్లింల పవిత్ర పర్వదినమైన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఉగాది, రంజాన్ వేడుకల సందర్భంగా.. నిన్ననే మధిర నియోజక వర్గానికి వెళ్లిన భట్టి విక్రమార్క నిన్న జరిగిన ఉగాది పర్వదిన వేడుకల్లో పాల్గొన్నారు. నియోజక వర్గ ప్రజల్లో కలిసి పోయి.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందరికీ అందుతున్నాయా? అని పేరు పేరునా అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వాళ్లందరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఇక, ఇవాళ రంజాన్ పర్వదినం సందర్భంగా మధిర పట్టణంలో రంజాన్ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పట్టణంలోని ముస్లిం కాలనీలో మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌసోద్దీన్ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీ మణులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. గౌసోద్దీన్ కుటుంబ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఘనంగా స్వాగతం పలికి వారి సాంప్రదాయ దుస్తులతో సత్కరించారు. కాలనీ వాసులంతా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం స్వయంగా తమ కాలనీకి వచ్చి రంజాన్ ఉత్సవాల్లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.