హైదరాబాద్ ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో శ్రీ విశ్వావసునామ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజ అనంతరం ఉగాది పండుగ సందర్భంగా సిద్ధం చేసిన పచ్చడి ప్రసాదాన్ని భట్టి విక్రమార్కకు అందజేశారు. అనంతరం ఆయనకు పూజారులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ శాసనసభ్యులు కేఎల్ఆర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా తెలిపారు.
నల్ల పోచమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గాంధీ భవన్ బయలు దేరి వెళ్లారు. గాంధీ భవన్లో జరగనున్న శ్రీ విశ్వావసునామ ఉగాది పండుగ సంద్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ భవన్కు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి భట్టికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గాంధీ భవన్లో ఉగాది వేడుకల్లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు.