ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదన్న చర్చ జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అన్నీ తెలిసినా, టీడీపీ-జనసేన మధ్య రోజు రోజుకూ విభేదాలు పెరుగుతున్నా.. పవన్ కల్యాణ్ మాత్రం ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఎందుకు జోక్యం చేసుకోవడం లేదో అర్థం కావడం లేదంటున్నారు. ఇది ఒక రకంగా టీడీపీ నేతలకు అనుకూలంగా మారిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఓ వైపు. .పిఠాపురంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, పవన్ కల్యాణ్ పరిస్థితిని అర్థం చేసుకుని, అప్పుడు సమాధానం ఇవ్వాలని పక్కా భావిస్తున్నారు. జనసేనలోనూ ఈ విషయంలో సాకారం పొందాలని భావిస్తున్న ఆలోచన ఉంది.
పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరిగినప్పటి నుండి తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య రాజకీయ దుమారం మొదలయ్యింది. జనసేన ఆవిర్భావ సభకు ముందుగానే మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం పవన్ కల్యాణ్ అడ్డా అని, ఆ నియోజకవర్గంలో మరో నేతకు అవకాశం లేదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్లకు దారి తీశాయి. పవన్ కల్యాణ్‌కి తెలియకుండా నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారని ఎవరూ అనుకోరంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో.. జనసేన నుంచి ఎవరు మాట్లాడినా జాగ్రత్త వహించడం పరిపాటి. అంతేకాకుండా.. పవన్‌కు తెలియకుండా ఆ నియోజకవర్గంలో ఏ పరిణామాలు జరగవని స్పష్టం చేస్తున్నారు. అందుకే నాదెండ్ల వ్యాఖ్యలతోనే క్యాడర్‌లో కాస్త అలజడి చెలరేగింది.
ఇక, జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలవడానికి ఆయనే స్వయంగా ఒక కారణమయితే, జనసేన క్యాడర్ మరో కారణమని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. ఎవరైనా పవన్ కల్యాణ్ విజయానికి తామే కారణమని భావిస్తే.. అది వారి ఖర్మ అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ వర్మతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల్లో తీవ్ర అలజడికి కారణమయ్యాయి. అంతే కాదు.. అదే సభా వేదికపై నుంచి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ మరింత ఇబ్బందికరంగా మాట్లాడారు. మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న తెలుగు దేశం పార్టీని ఏపీలో తిరిగి తామే నిలబెట్టి ప్రభుత్వంలోకి వచ్చేలా చేశామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యనానించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ నేతల్లో అసంతృప్తిని రగిలించాయి.
అప్పటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో ఓ వైపు టీడీపీ, మరో వైపు జనసేన పార్టీ నేతలు, క్యాడర్ మధ్య పొసగడం లేదన్నది అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. కానీ, రెండు పార్టీల అగ్రనేతలు పిఠాపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దృష్టి పెట్టక పోవడంతో రోజురోజుకూ విభేదాలు మరింత ముదురుతున్నాయి. ముఖ్యంగా ఈ వివాదాలు, విభేదాలకు ప్రధాన కారకులుగా చెప్పుకోవాల్సిన పవన్ కల్యాణ్ మాత్రం.. ఈ వివాదాల పరిష్కారానికి ఒక సొల్యూషన్ చూడటం లేదు. కనీసం సమాధానం ఇవ్వడం లేదు. దీంతో, ఈ పవన్ కల్యాణ్ మౌనం టీడీపీ నేతలకు మరింత వ్యతిరేకంగా మారి, విభేదాలను పెంచే పరిస్థితి కల్పిస్తోంది.
ఇప్పటికిప్పుడు పిఠాపురం జనసేన ఇన్ ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. నియోజకవర్గంలో ఆర్‌వో ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రెండు మిత్ర పక్ష పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తమ నేత, టీడీపీ నియోజక వర్గ ఇంచార్జ్ వర్మకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడం వల్లనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పిఠాపురంలో తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కానీ, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం విభేదాలను రూపు మాపే ప్రయత్నం చేయకపోవడం కూడా తెలుగు దేశం పార్టీ నేతలకు మరింత ఆగ్రహం కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా తమ పార్టీ నేతలకు, క్యాడర్ కు సర్దిచెప్పాల్సిన పవన్ కల్యాణ్.. మౌనం పాటించడం వెనక పెద్ద లక్ష్యమే ఉందన్న చర్చ జరుగుతోంది. పిఠాపురంలో తనకన్నా పాపులర్ కాకుండా.. వర్మను పూర్తిగా సైడ్ చేయాలన్న లక్ష్యమే పవన్ కల్యాణ్ వ్యూహంలో భాగమన్న అభిప్రాయం పిఠాపురంలో షికార్లు చేస్తోంది.