- క్యాబినెట్ విస్తరణ పై కీలక నేతల సైలెంట్.
- ఉగాది కి ఉంటుందని మొదట ప్రచారం ఇప్పుడు తాజాగా వచ్చేవారం.
- క్యాబినెట్ విస్తరణ పై సీఎంతో సహా అందరూ మౌనం.
- మళ్లీ ఢిల్లీ బాట పట్టిన ఆశావాహులు.
- చివరి నిమిషంలో మార్పులు చేర్పులపై ఆశలు.
ఉగాదికి అని… పంచమి నాడు మంచిదని… ఏప్రిల్ 3వ తేదీ అని… ఇలా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ పై గడచిన వారం రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. అయితే అకస్మాత్తుగా ఏమైందో ఏమో మళ్లీ అందరూ సైలెంట్ అయ్యారు. మకేం సమాచారం రాలేదని ఆశావాహులు అంటుండగా, సీయం రేవంత్‌రెడ్డి ఈ విషయంపై ఎక్కడా నోరు తెరవడం లేదు. సీయంతో పాటు ఢిల్లీ వెళ్లిన ఉప ముఖ్యమంత్రి సైతం ఈ విషయంపై పెదవి విప్పడం లేదు. ఉగాదికే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం ఢిల్లీ పర్యటన తర్వాత అందరూ అనుకున్నారు. మంత్రివర్గంలో స్థానం కోసం ఆశిస్తున్న వారు కూడా ఇక రెపో మాపో అన్నట్టుగానే హడావిడి చేశారు. కొంత మంది ఆశావాహులు తమకు ఫలానా శాఖ అంటే ఇష్టం… ఫలానా శాఖపై ఇంట్రస్ట్ అంటూ విలేకరులతో చిట్‌చాట్ లు కూడా చేశారు. అయితే సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ పై పెద్దగా మాట్లాడలేదు.. విస్తరణకు సంబంధించి తమకు కూడా సమాచారం లేదని సీనియర్లు కూడా అంటున్నారు.
తాజాపరిణామాలను బట్టి చూస్తే ముందుగా అనుకున్నట్లుగా ఏప్రిల్ 3వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం కనిపించడం లేదని, ఉంటే గింటే ఏప్రిల్ మొదటి వారం తరువాతే విస్తరణ ఉండే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అధిష్టానం మాత్రం ఈ విషయంపై ఎవరూ తొందరపడి కామెంట్లు చేయొద్దని ఆదేశించినట్లుగా తెలిసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం దాటింది. కేవలం తొమ్మిది మంది మంత్రులతో క్యాబినేట్ నడుపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ముఖ్యమైన శాఖలకు ఈ ఏడాదిన్నరగా మంత్రులు లేదు. చాలా ప్రాధాన్యత శాఖలు సీయం వద్దే ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఉన్న పని ఒత్తిడి కారణంగా ఆ శాఖల రోజు వారీ వ్యవహారాలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు చూడాల్సి వస్తోంది. వారిద్దరికి కూడా ఇది అదనపు భారమే. అయితే ఇంకా క్యాబినెట్ లోకి ఆరుగురికి స్థానం కల్పించే అవకాశం ఉంది. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ప్రస్తుతం క్యాబినెట్లు ప్రాతినిధ్యం లేదు. రాజకీయంగా పెద్ద కీలకమైన ఈ జిల్లాల నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం సొంత పార్టీ నేతలని ఇబ్బందులకు గురిచేస్తుంది.
ఇప్పుడు జరిగే విస్తరణలో ఆరుగురికి అవకాశం కల్పిస్తారా లేక నలుగురికి మాత్రమే అవకాశం కల్పించి మరో రెండు స్థానాలు పెండింగ్లో పెడతారని అంశం పైన కూడా క్లారిటీ లేదు. లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఇప్పటికే తమ వర్గానికి సంబంధించిన వారికి కచ్చితంగా క్యాబినెట్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఏకంగా అధిష్టానానికి లేక కూడా రాశారు. జాతీయస్థాయిలో మైనారిటీల విషయంలో పాజిటివ్ దృక్పథంతో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా లేకపోవడం విమర్శలకు దారితీస్తుంది.
బీసీల్లో కూడా వివిధ వర్గాలు తమకు అవకాశం కల్పించాలని అధిష్టానం పై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. ఈ సారి మంత్రివర్గంలో తెలంగాణలో ప్రిడామినెంట్ సామాజికవర్గాలైన మున్నూరు కాపు, యాదవ, ముదిరాజ్ వర్గాలకు స్ధానం కల్పించలేదు. ఇంతవరకూ ఎప్పుడూ ఇలా జరగలేదని, తాము లేని క్యాబినేట్ ఇంత వరకూ లేదని ఈ సామాజికవర్గ నేతలే కాకుండా శాసనసభ్యులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు నేరుగా అధిష్టానానికి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు ఈ సామాజికవర్గాలన్నింటికీ క్యాబినేట్ లో స్ధానం కల్పించకుండా విస్తరణ చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు వస్తే ఇబ్బంది అవుతుందని అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తం అవుతోంది. అలా అని మంత్రిమండలిని పూర్తిస్థాయిలో విస్తరణ చేయకుండా ఇలాగే కొనసాగితే పాలనా పరమైన ఇబ్బందులు ఇప్పటికే ఎక్కువైనట్లుగా సీనియర్లు అంగీకరిస్తున్నారు. కీలకమైన హోమ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్య, కమర్షియల్ ట్యాక్స్ వంటి శాఖలకు ప్రస్తుతం మంత్రులు లేరు. దాదాపు ఇవన్నీ ప్రతిరోజు సమీక్షించాల్సిన శాఖలు. ముఖ్యమంత్రి వద్దనే ఈ శాఖలు ఉండడం వల్ల అధికారులు నేరుగా సీఎం వద్దకు వెళ్లి తమ తమ శాఖలకు సంబంధించిన అంశాలపై మాట్లాడేలేకపోతున్నారని కొందరు అంటున్నారు.
అయితే తాజాగా అసెంబ్లీ చివరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ ఎప్పటికీ తన వద్దనే ఉంటుందని ఒక కామెంట్ చేశారు. గతంలో మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా ఆయన ఇదే విధమైన కామెంట్ చేశారు. శాఖల విషయం ఇలా ఉంటే మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురుచూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, విజయశాంతి, ఆది శ్రీనివాస్ వంటి ఎమ్మెల్యేలు ప్రతిరోజు విస్తరణ గురించి ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడ అవకాశం ఉన్న ఈ విషయంపై మాట్లాడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా విస్తరణ జరగాలన్నది ఈ నేతల అభిప్రాయం. సీఎంతో పాటు పిసిసి అధ్యక్షులు అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వంటి నాయకులు మాత్రం విస్తరణ గురించి సైలెంట్ గానే ఉన్నారు. ఇలాంటి కామెంట్స్ చేయడం లేదు. దీంతో మరింత టెన్షన్ పెరిగిపోయింది.
తాజాగా శ్రీరామనవమికి విస్తరణ ఉంటుందన్న ప్రచారం మళ్లీ మొదలైంది. ఉగాదికి జరుగుతుందని మొదట భావించినప్పటికీ ప్రస్తుతం మరో వారం రోజుల పాటు వాయిదా పడిందని కొందరు అంటున్నారు. ప్రచారాలు ఈ విధంగా జరుగుతున్నా అధిష్టానం నుంచి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ వస్తే గంటలో విస్తరణకు సంబంధించి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని మరికొందరంటున్నారు. ఏదైనా ప్రస్తుతానికి మాత్రం ఈ విస్తరణ అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉందంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.