ఆంధ్ర ప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షల విధానంలో ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు 2025-26 విద్యా సంవత్సరంలో అమల్లోకి రానున్నాయి. తొలిసారిగా ఇంటర్ విద్యలో ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఇంటర్ మీడియట్ సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలో ఇంటర్మీడియట్ బోర్డు కొన్ని కీలక మార్పులు చేపట్టింది. ఈ మార్పుల వివరాలను జూనియర్ కళాశాలలకు పంపింది.
ఇంటర్ మొదటి సంవత్సరానికి ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను అమలు చేయనున్నారు. ఇప్పటికే పదో తరగతిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు అయిన నేపథ్యంలో, దానిని ఇంటర్మీడియట్‌కు పొడిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఇంటర్ గణితంలో ఏ, బీ పేపర్లు ఉండగా, వాటిని కలిపి ఒక్క పేపర్‌గా మారుస్తున్నారు. మొత్తం మార్కులను 150 నుంచి 100కి కుదిస్తున్నారు. ఫలితంగా, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు వంద మార్కులకు ఒక్క గణిత పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఇక భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం పేపర్లు ప్రస్తుతం 60 మార్కుల చొప్పున ఉండగా, కొత్త విధానంలో వాటిని 85 మార్కులకి పెంచుతున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు మొదటి సంవత్సరం నుంచి 15 మార్కులు, రెండో సంవత్సరం నుంచి 15 మార్కులు కలిపి మొత్తం 30 మార్కులు ఉంటాయి. బైపీసీ గ్రూపులో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రాలను కలిపి జీవశాస్త్రం పేపర్‌గా ఇచ్చి, వృక్షశాస్త్రానికి 43 మార్కులు, జంతుశాస్త్రానికి 42 మార్కులు కలిపి 85 మార్కుల రాత పరీక్ష నిర్వహిస్తారు.
సీఈసీ గ్రూపులో కామర్స్, అకౌంటెన్సీ పేపర్లను 50 మార్కుల చొప్పున కలిపి ఒకే పేపర్‌గా రూపొందించారు. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఆంగ్లం, కామర్స్‌లో అకౌంటెన్సీ మినహా మిగతా సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు నాలుగు సెక్షన్లుగా ఉంటాయి. సైన్సు గ్రూపుల్లో ఐదు సబ్జెక్టులు మాత్రమే కొనసాగుతాయి.
ప్రతీ పేపర్లో ఒక్క మార్కు ప్రశ్నలను సీబీఎస్ఈ విధానంలో ప్రవేశపెడుతున్నారు. కొత్త విద్యా సంవత్సరంలో ఇంటర్ మొత్తం పనిదినాలు 314 ఉండగా, 79 సెలవులు ఉంటాయి. మిగిలిన 235 రోజులు తరగతులు కొనసాగుతాయి. ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలుతో విద్యా సంవత్సరంలోనూ మార్పులు చేశారు. ఏప్రిల్ 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహించి, 24 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఉంటాయి. దసరా సెలవులు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఉంటాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరిలో, పబ్లిక్ పరీక్షలు మార్చిలో నిర్వహించబడతాయి.