మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కొత్త చిక్కుల్లో పడ్డారు. తన స్నేహితుడు, మరో సూపర్ స్టార్ మమ్ముట్టి ఆరోగ్యం మెరుగవ్వాలని ఆయన చేసిన పని ఇప్పుడు ముస్లింలలో కొందరికి కోపం తెప్పించింది. అంతేకాదు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు కూడా మొదలయ్యాయి. ఆయన మాత్రం తాను ఏ తప్పు చేయనప్పుడు సారీ అనే మాటెందుకు అంటున్నారు.
శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో ఉషా పూజ నిర్వహించారు. ఈ ప్రత్యేకపూజలో మోహన్‌లాల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరిన మమ్ముట్టి వెంటనే కోలుకోవాలంటూ ఆయన పూజ చేయించారు. దీనికి సంబంధించిన రసీదులో మమ్ముట్టి పేరును.. మొహమ్మద్ కుట్టి.. అతని నక్షత్రం విశాఖ అని నమోదు చేశారు. ఈ రసీదు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వివాదం మొదలైంది.
ఇప్పుడు మోహన్‌లాల్ ముస్లింల మనోభావాలను దెబ్బతీశారు కాబట్టి వెంటనే క్షమాపణలు చెప్పాలని కేరళకు చెందిన జర్నలిస్ట్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఇతను సీనియర్ జర్నలిస్ట్ మాత్రమే కాకుండా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ముస్లింలు అల్లాను తప్ప మరేవరిని పూజించరని.. మోహన్‌లాల్ ఇలా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ పూజను చేయాలని మమ్ముట్టి కనుక కోరి ఉంటే.. ఆయన ఇస్లాం విశ్వాసాల ప్రకారం నేరం చేసినట్టే అన్నారు.
ఈ వివాదం కాస్త పెద్దగా కావడంతో మోహన్‌లాల్ రియాక్ట్ అయ్యారు. తన ఫ్రెండ్ కోలుకోవాలని పూజ చేయడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. అంతేకాదు దేవాలయ సిబ్బందిలో ఎవరో ఒకరు రసీదును లీక్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
మొత్తంగా చూస్తే మోహన్‌లాల్ చేసిన పనిని కొందరు దీన్ని వారిద్దరి మధ్య స్నేహబంధం ఎంత గట్టిదన్న యాంగిల్లో చూస్తే.. మరికొందరు హిందువైన మోహన్ లాల్ ముస్లిమ్ అయిన మమ్ముట్టి పేరు మీద అయ్యప్ప స్వామి గుడిలో ఎలా పూజలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.